Bojjala : రాయుడు చెప్పిన దాంట్లో నిజమెంత? బొజ్జల ప్రమేయం ఉందా?
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి తాజాగా విడుదలయిన వీడియో సంచలనం రేపుతుంది
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి తాజాగా విడుదలయిన వీడియో సంచలనం రేపుతుంది. వరసగా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గానే కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తి అప్పటి జనసేన ఇన్ ఛార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ప్రయివేటు వీడియాలో తనకు పంపితే 30 లక్షల రూపాయలు ఇస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి కొందరి వ్యక్తులతో చెప్పించినట్లు వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు వీడియో చర్చనీయాంశమైంది. రాయుడి హత్య జరిగిన ఇన్నాళ్లకు ఈ వీడియో బయటకు రావడంతో బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు మాత్రం కావాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా వారంటున్నారు.
చెన్నైలో హత్య చేసి...
డ్రైవర్ రాయుడిని కోట వినుత దంపతులు చెన్నైలో హత్య చేసి పడవేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులందరినీ చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోట వినుత కొంతకాలం క్రితం బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. బొజ్జల సుధీర్ రెడ్డితో జనసేన స్థానిక నేతలు పేట చంద్రశేఖర్, కొట్టే సాయిప్రసాద్ లు సహకరించారని రాయుడు తన సెల్ఫీ వీడియోలో పేర్కొనడం విశేషం. 2024 ఎన్నికలకు ముందు నుంచే జనసేన నేతలు బొజ్జల సుధీర్ రెడ్డికి టచ్ లో ఉన్నారని రాయుడు వీడియోలో చెప్పాడు. వారే తనతో ఈ డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు.
ఇరవై రెండు లక్షలు ఇచ్చారంటూ...
కోట వినుత దంపతులను చంపితే భారీ మొత్తం ఇస్తానని తన అనుచరుడు సుజిత్ రెడ్డితో చెప్పించాడని రాయుడు వీడియోలో పేర్కొన్నాడు. తాను రెండు సార్లు హత్య చేయడానికి ప్రయత్నించానని, రోడ్డు ప్రమాదంలో చంపాలని తాను చేసిన ప్రయత్నం విఫలం కావడంతో తనను డ్రైవర్ గా తప్పించారని కూడా రాయుడు పేర్కొన్నారు. అలాగే ఎన్నికలకు ముందు సుజిత్ రెడ్డి తనకు కోట వినుత దంపతుల విషయాలు ఎప్పటికప్పుడు చెబితే ముప్ఫయి లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, తొలుత రెండు లక్షలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఇరవై లక్షలు ఇచ్చారని సెల్ఫీ వీడియోలో తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం నివేదిక కోరడంతో రహస్యంగా విచారించి ఈ వీడియో పై ఆరా తీస్తున్నట్లు సమాచారం.