రాధ హత్యకేసులో వీడిన మిస్టరీ.. భర్తే హంతకుడు

కాశిరెడ్డి పేరిట సిమ్ కార్డు కొన్న మోహన్.. అతడి లాగానే చాటింగ్ చేశాడు. డబ్బులిస్తానని చెప్పి మే 17న స్వగ్రామమైన ప్రకాశం..

Update: 2023-05-21 06:08 GMT

big twist in kota radha murder case

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు శివారులో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కూరుతో తొక్కించి, బండరాళ్లతో మోది, సిగరెట్లతో కాల్చి ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసు.. కీలక మలుపు తిరిగింది. జిల్లెళ్లపాడు గ్రామ శివారులో కోటరాధ (35) అనే మహిళ దారుణ హత్యకు గురవ్వగా.. తొలుత అప్పుతీసుకున్న స్నేహితులు హత్యచేశారని భావించారు పోలీసులు. కానీ తాజాగా ఆమె భర్తే ఆ హంతకుడని తేలింది. రాధను ఆమె భర్త కోట మోహన్ రెడ్డి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు.

సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం (మే20) సాయంత్రం రాధ అంత్యక్రియలు ముగిసిన అనంతరం మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రకాశం జిల్లాకు విచారణకై తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో రాధను ఎందుకు హతమార్చాడో వివరించాడు. ఉద్యోగం కోల్పోయి కష్టాల్లో ఉన్న స్నేహితుడు కాశిరెడ్డి ఆదుకోవాలని భావించిన రాధ.. అతనికి సుమారు రూ.80 లక్షలు అప్పుగా ఇచ్చింది. తీసుకున్న డబ్బు కాశిరెడ్డి తిరిగి ఇవ్వకపోవడంతో..రాధ-మోహన్ ల మధ్య గొడవలు మొదలయ్యాయి. దానికితోడు మోహన్ రెడ్డికు భార్యమీద అనుమానం కలిగింది. కాశిరెడ్డితో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని అనుమానించాడు.
కాశిరెడ్డి పేరిట సిమ్ కార్డు కొన్న మోహన్.. అతడి లాగానే చాటింగ్ చేశాడు. డబ్బులిస్తానని చెప్పి మే 17న స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కనిగిరికి రప్పించాడు. రాధ అక్కడికి రాగానే మోహన్ రెడ్డి.. మరికొందరితో కలిసి అక్కడికి వెళ్లి రాధను కిరాతకంగా హత్య చేశాడు. కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్ లో ఉన్న రాధను ఎక్కించుకుని వెళ్లిన ఎరుపు రంగు కారు హైదరాబాద్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆపై ఆమె భర్త ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో.. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. స్నేహితుడికి ఇచ్చిన అప్పుగురించి భర్త పెట్టే వేధింపులు భరించలేని రాధ.. తన తల్లిదండ్రులు, బంధువుల వద్ద నుండి రూ.25 లక్షలు తీసుకుని మోహన్ కు ఇచ్చినట్లు తెలిసింది. రాధ హత్యతర్వాత కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో.. అతనే హత్యచేసి ఉంటాడని అందరూ అనుమానించారు. ఈ హత్య వెనుక మోహన్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News