చిన్న గొడవ.. ఆత్మహత్య చేసుకున్న టీచరమ్మ

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చిన్న విషయానికే మనస్థాపానికి గురై తీసుకోకూడని నిర్ణయం తీసుకొని

Update: 2023-07-21 10:23 GMT

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చిన్న విషయానికే మనస్థాపానికి గురై తీసుకోకూడని నిర్ణయం తీసుకొని ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఇద్దరు పిల్లల్ని అనాథలను చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని ఎన్బీటీ నగర్‌లో గాయత్రి, సువీర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 14 నెలలు పెద్ద కూతురు, మూడు నెలల చిన్న కూతురు ఉన్నారు. గాయత్రి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. గాయత్రి కుటుంబంతో పాటు ఆమె తల్లి మహాదేవమ్మ కూడా వారితో కలిసి నివాసం ఉంటుంది. అయితే నిన్న గురువారం భారీగా వర్షం కురుస్తున్న సమయంలో గాయత్రి తన పెద్ద కూతుర్ని తీసుకొని బయటకు వెళ్తున్నానని తల్లికి చెప్పింది. అయితే అందుకు గాయత్రి తల్లి మహదేవమ్మ నిరాకరించింది.

ఇంత పెద్ద వర్షంలో పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్లొద్దు అంటూ హెచ్చరించింది. దీంతో మాట మాట పెరిగి తల్లి కూతుర్ల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది. ఈ గొడవ కారణంగా గాయత్రి తీవ్ర మనస్థాపానికి గురైంది. గాయత్రి గురువారం సాయంత్రం సమయంలో తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గాయత్రి గది నుండి ఎంతకు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తల్లి మహదేవమ్మ భర్త సువీర్ తలుపు కొట్టారు. అయినా కూడా లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా గాయత్రి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Tags:    

Similar News