Gold Price Today : కనికరం లేకుండా పెరుగుతున్న బంగారం.. షాకిస్తున్న వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటేనే షాక్ ఇస్తున్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్, శుభముహూర్తాల సమయంలో బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమయ్యేటట్లు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇలా బంగారం అనేది ఒక అపురూపమైన వస్తువుగా మారనుంది. ఇలాగే పెరిగితే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ధరల పెరుగుల ప్రభావం అమ్మకాలపై తీవ్రంగా చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
కొనుగోలు చేసేవారు...
బంగారాన్ని కొనేవారు ప్రస్తుతం కనిపించడం లేదు. తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్షలు పోయాలి. అంత సొమ్ము ఖర్చు చేసి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ప్రధానంగా మధ్యతరగతి, ఉద్యోగులు, ఎగువ మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేస్తేనే బంగారానికి డిమాండ్ ఉంటుంది. కానీ బంగారానికి డిమాండ్ తో పనిలేదు. సీజన్ తో సంబంధం లేదు. తన పని పెరగడమే భావిస్తున్నట్లుంది. అందుకే ఈ ఏడాది ప్రారంభమైన ధరల పెరుగుదల ఇక ఆగేటట్లు కనిపించడం లేదు. మరో రెండు నెలల పాటు పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండటంతో పాటు పండగలు కూడా వస్తుండటంతో భారీగా ధరలు పెరిగి ఇక అందనంత దూరంలో ఉంటాయన్నది మాత్రం అతిశయోక్తి కాదు.
తన రికార్డులు తానే...
బంగారం ప్రతి రోజూ తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటుంది. ధరల పెరుగుదల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. దీని ప్రభావం వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బంగారానికి చాలా వర్గాల ప్రజలు ఇప్పటికే దూరమయ్యారు. తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,06,060 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,700 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,50,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు ఇంకా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.