జాతి పార్టీలైనా.. జాతీయ పార్టీలతోనైనా మీ ఇష్టం.. వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్

టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పొత్తులను ఉద్దేశించి వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-05-09 12:33 GMT

ఏపీలో పొత్తుల పంచాయితీపై మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కీలక నేత వి.విజయసాయి రెడ్డి మరోమారు వరుస ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు. సింగిల్‌గా వస్తారో.. లేక వేరే పార్టీలతో మింగిలై వస్తారో మీ ఇష్టం.. జాతి పార్టీలతో జతకడతారో లేక జాతీయ పార్టీలతో కలుస్తారో మీ ఇష్టం అంటూ టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. వైసీపీ మాత్రం ప్రజలతో మింగిల్ అవుతుందని.. మా అధినేత జగన్ మాత్రం ఎప్పటికీ జనంతోనే మమేకమవుతారని అన్నారు.

ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఎన్నికలకు వెళ్లడం పద్ధతని విజయసాయి అన్నారు. కానీ పొత్తుల కోసం తెరవెనుక మంత్రాంగాలు నడిపే వ్యూహాలకు.. జనంతో సంబంధం లేని ఎత్తుగడలకు కాలం చెల్లిందన్నారు. అబద్ధాన్ని వంద సార్లు చెప్పి గోబెల్స్ ప్రజలను వంచించాడని.. అతని సాయంతో జర్మనీని 12 ఏళ్లు ఏలిన హిట్లర్ యుద్ధంలో గెలిచాడా? అని సెటైర్లు వేశారు.

'తనకు బాకా ఊదే పచ్చ మీడియాలో చంద్రబాబు గంటలకొద్దీ సుత్తి. వారేమో ఆయనకు పూర్ణకుంభ స్వాగతాలు. ప్రజలకన్నా పచ్చ మీడియానే నమ్మే నీ డ్రామాలు జనం చూస్తున్నారు బాబూ! ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే వారు ఎన్టీఆర్. నీదేమో పచ్చ మీడియానే దేవాలయం, వాటి అధిపతులే ప్రభువులు అనే సిద్ధాంతం.' అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.

అందరూ కలిస్తే తప్ప సీఎం జగన్‌ను ఎదుర్కోలేమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఆయన పరపతి ఎంతగా పలచబడి పోయిందో తెలుస్తోందని విజయసాయి అన్నారు. అందరినీ కలిసిరావాలని బతిమాలుకుంటూ రాజకీయ పునరేకీకరణ అనే పరువు తక్కువ పేరుతో పిలుస్తాడంటూ మండిపడ్డారు. ఎప్పుడో ఏదో చేశానని కథలు చెప్పడం తప్ప ఒంటరిగా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి బాబుదని ఎంపీ విమర్శించారు.

Tags:    

Similar News