Vanga Geetha : వంగా గీతకు నో ఆప్షన్.. జగన్ అంగీకరించడం లేదా?
వైసీపీ నేత వంగా గీత ఎందుకో యాక్టివ్ గా లేరు.
వైసీపీ నేత వంగా గీత ఎందుకో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వంగా గీత ఇప్పుడు రాజకీయంగా కామ్ అయిపోయారు. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ పవన్ కల్యాణ్ బరిలో ఉండటంతో వంగా గీతను పిఠాపురం ప్రజలు ఆదరించలేదు. నాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాము అధికారంలోకి వస్తే వంగా గీతను ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేస్తానని హామీ ఇచ్చినా వర్క్ అవుట్ కాలేదు. 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వంగా గీత పెద్దగా కనిపించడం లేదు. అప్పడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా పూర్తిస్థాయిలో యాక్టివ్ గా లేరన్నది వాస్తవం.
ఎంపీగా ఎన్నికై...
2019 ఎన్నికల్లో వంగా గీత కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లు బాగానే ఉన్నారు. అయితే ఆమెకు పార్లమెంటు కంటే శాసనసభలోకి ప్రవేశించాలన్న మక్కువే ఎక్కువ ఉంది. జగన్ కూడా పిఠాపురం నియోజకవర్గం కేటాయించడంతో పవన్ కల్యాణ్ తో హోరా హోరీ పోరాడారు. కానీ అవతల ఉన్నది పవన్ కల్యాణ్ కావడం, ఆయన అభిమానులు,సామాజికవర్గం ఓటర్లు పవన్ కు పక్కాగా ఓటేయడంతో వంగా గీత దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. ఆయన వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతారు.
పవన్ అడ్డాగా మార్చుకోవడంతో...
పవన్ కల్యాణ్ పై పోటీ చేసి గెలుపొందడం కష్టమేనని భావిస్తున్న వంగా గీత తనకు వేరే నియోజకవర్గాన్ని అప్పగిస్తే బాగుంటుందన్నఅభిప్రాయంలో ఉన్నట్లు కనపడుతుంది. ఇక్కడ మళ్లీ పవన్ పై పోటీ చేసినా గెలుపు అనేది చాలా వరకూ కష్టమే కావడంతో ఆమె మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. కానీ జగన్ నుంచి ఇప్పటి వరకూ దీనిపై క్లారిటీ రాకపోవడంతో వంగా గీత యాక్టివ్ గా లేరంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి తాను తప్పు చేశానా? అన్న అంతర్మధనంలో వంగా గీత ఉన్నట్లు తెలుస్తోంది. వంగా గీత పిఠాపురంలోనూ పెద్దగా యాక్టివ్ గా లేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు.