YSRCP : ముహూర్తం తరచూ మారిస్తే ఎలాగన్నయ్యా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవ్వడం లేదు

Update: 2025-02-18 05:36 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంకా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవ్వడం లేదు. తొలుత సంక్రాంతి తర్వాత జిల్లా పర్యటనలు చేస్తానన్న జగన్ తర్వాత దానిని వాయిదా వేశారు. ఇప్పుడు ఉగాది తర్వాత నుంచి జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉగాది తర్వాత జగన్ పర్యటనలు ఉంటాయన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే దీనిపై అధికారిక పర్యటన ఇంత వరకూ వెలువడలేదు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాతనే ఆయన జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారా? లేక మరికొంత కాలం వెయిట్ చేస్తారా? అన్న క్లారిటీ పార్టీ నేతలకే లేదు. ఎందుకంటే పదిహేను రోజులకొకసారి తాడేపల్లికి వస్తున్న జగన్ జిల్లా నేతలతో పార్టీ కార్యాలయంలోనే సమావేశాలవుతున్నారు.

సమావేశాల్లో ప్రసంగాలతో...
సమావేశాల్లో మాత్రం ఈసారి మనదే అధికారమంటూ గట్టిగానే భరోసా ఇస్తున్నారు. హామీలు అమలు చేయడం లేదని కూటమి ప్రభుత్వం ఉన్న కొద్దో గొప్పో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నం మాత్రం జగన్ చేయడం లేదు. మీడియా సమావేశాలతో కాలక్షేపం చేస్తున్నారు. మరొకవైపు పార్టీ నేతలు వరస బెట్టి వెళ్లిపోతున్నారు. కూటమి పార్టీల మధ్య కూడా సయోధ్య లేదు. అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల కార్యకర్తలు, నేతల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎంత త్వరగా ఉంటే అంత మేలు జరుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. జగన్ సభలకు, రోడ్ షోలకు భారీగా జనం వస్తారని తెలుసు. దానిని చూసైనా నేతలు పార్టీని విడిచి వెళ్లకుండా ఆగే అవకాశముందని సీనియర్ నేతలు చెబుతున్నారు.
నిదానమే ప్రదానం అంటే...?
నిదానమే ప్రధానం అనే సామెత రహదారిపై వాహనాలకు సరిపోతుంది తప్పించి రాజకీయాల్లో అది వర్తించదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అధికార పార్టీని ఇరుకున పెడుతూ ప్రజలకు తాము అండగా ఉన్నామన్న సంకేతాలను బలంగా పంపించిన నాడే జనం నమ్ముతారు. పార్టీ వైపు నిలబడతారు. హామీలు అమలయిన తర్వాత జగన్ జిల్లాల పర్యటనలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ముందుగానే పర్యటనలు చేసి హామీలుఅమలు చేయాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం జగన్ దెబ్బకు దిగి వచ్చిందనైనా కొంత మంది ప్రజలు నమ్మే అవకాశముంది. గత ఎన్నికల్లో పూర్తిగా బలహీనపడి తక్కువ స్థానాలు వచ్చినజిల్లాలకు వెళ్లి అక్కడి నుంచి యాత్రలను ప్రారంభిస్తేనే పార్టీ నిలబడుతుంది.
రోడ్ మ్యాప్ ఏదీ?
కానీ జగన్ కు మాత్రం ఆ ఆలోచన లేనట్లుంది. లండన్ పర్యటనతో సంక్రాంతి తర్వాత చేస్తానని చెప్పిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఉగాది అని అంటున్నారు. అప్పటికీ ఏ అవాంతరాలు వస్తాయో ఎవరికీ తెలియదు. అందుకే జనంలో ఉండటమే మేలన్నది నేతల అభిప్రాయం అయినప్పటికీ జగన్ మాత్రం ఇంకా తన జిల్లాల పర్యటనకు రోడ్ మ్యాప్ ను తయారు చేసుకోలేదు. జిల్లాల్లో పార్టీ నాయకత్వం బలపడాలన్నా, క్షేత్రస్థాయిలో క్యాడర్ లో ధైర్యం పెరగాలన్నా జగన్ పర్యటనలు అనివార్యమంటున్నారు. కానీ జగన్ కు ఈ విషయాలు చెప్పేవారు లేక... ఆయన వినడం అనేది తెలియక ఉన్న ఛాన్స్ ను మిస్ చేసుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News