Ys jagan : అవమానం పడితే ఏమీ.. వచ్చే లాభాన్ని జగన్ కాలదన్నుకుంటున్నారుగా

వైసీపీ చీఫ్ జగన్ తప్పు చేస్తున్నారు. అసెంబ్లీకి గైర్హాజరవుతూ ఆయన తనకు వచ్చే సానుభూతిని కూడా కాదనుకుంటున్నారు.

Update: 2025-09-02 07:59 GMT

వైసీపీ చీఫ్ జగన్ తప్పు చేస్తున్నారు. అసెంబ్లీకి గైర్హాజరవుతూ ఆయన తనకు వచ్చే సానుభూతిని కూడా కాదనుకుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సమాన వయస్కుడు, రాజకీయంలో సహచరుడు అయిన చంద్రబాబు తనకంటే వయసులోనూ, అనుభవంలోనూ చిన్నవాడైన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు మూడున్నరేళ్ల పాటు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అవమానాలను భరించారు. జగన్ కాకపోయినా వైసీపీ నేతలు చాలా మంది చంద్రబాబుపై దుర్భాషలాడుతున్నా ఆయన నవ్వుతూ స్వీకరించారు. అదే ఆయనకు వరంగా మారింది. 2024 శాసనసభ ఎన్నికల్లో ఆయనకు సింపతీ తెచ్చి పెట్టడానికి అసెంబ్లీ సమావేశాల్లో మాటలు పడటం కూడా ఒక కారణమని అంగీకరించాలి.

కేసీఆర్ పరిస్థితి వేరు...
ఒక పొరుగున ఉన్న తెలంగాణలోనూ కేసీఆర్ శాసనసభకు వెళ్లడం లేదు. అక్కడ కూడా తన కంటే వయసులో, అనుభవంలో చిన్నవాడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో కేసీఆర్ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే కేసీఆర్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. కేసీఆర్ రాకపోయినా బలమైన గొంతుకలు వినిపించే నేతలు బీఆర్ఎస్ లో ఉన్నారు. కేసీఆర్ కు దీటుగా మాట్లాడే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి వంటి వారు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టగలరు. కానీ జగన్ కు ఉన్న పది మంది శాసనసభ్యుల్లో అటువంటి వారు లేకపోవడం కొంత ఇబ్బందికరమే. అయినా జగన్ శాసనసభకు వచ్చి అవమానాలు పడినా తర్వాత ఆనందం దక్కుతుందని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు.
అవమానాలు పడినా...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విసిరిన సవాల్ కు ఏ మేరకు స్పందించాలన్నది చూడాలి. చంద్రబాబు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని చంద్రబాబు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎవరిది విధ్వంసమో? ఎవరిది అభివృద్ధో తేల్చుకుందామని అన్నారు. జగన్ శాసనసభకు వచ్చినా ఎద్దేవా చేస్తారు. ఆయన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి పనులలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తారు. పవన్ కల్యాణ్, లోకేశ్ లు మాత్రమే కాకుండా చంద్రబాబు ప్రాపకం పొందేందుకు, లోకేశ్ నుంచి మన్ననలను పొందేందుకు టీడీపీ నేతలు ఖచ్చితంగా రెచ్చి పోతారు. అది జగన్ కు అడ్వాంజేజీ అవుతుంది. కొద్ది సమయం అవమానాలు పడినా భవిష్యత్ లో రాజకీయంగా లాభం చేకూరుతుంది.
కోటరీ మాటలు విని...
కానీ జగన్ తన మొండి పట్టు వీడటం లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు వెళ్లనని భీష్మించుకుని కూర్చున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష హోదా నాలుగేళ్లు ఇవ్వను కాక ఇవ్వదు. కానీ జనం దృష్టిలో జగన్ శాసనసభకు గైర్హాజరవుతున్నారన్న పేరు మాత్రం మూటగట్టుకోక తప్పదు. దాని కంటే కొన్ని రోజులు అవమానాలు భరించడానికి జగన్ సిద్ధమయితే అది తమకు లాభిస్తుందని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నప్పటికీ జగన్ చుట్టూ ఉన్న కోటరీ మాత్రం పడనివ్వడం లేదని తెలిసింది. జగన్ శాసనసభ కు వెళ్లనంత వరకూ కూటమి పార్టీ నేతలు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూనే ఉంటారు. అంది వచ్చే అవకాశాన్ని జగన్ కావాలని కాదనుకుంటన్నట్లే కనిపిస్తుంది.







Tags:    

Similar News