Ys Jagan : జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టారా? ఇద్దరినీ వేరు చేయడానికేనా?
వైసీపీ అధినేత జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లే కనపడుతుంది. టీడీపీ నుంచి బీజేపీని దూరం చేయడానికి అడుగులు వేస్తున్నట్లే ఉంది
వైసీపీ అధినేత జగన్ మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లే కనపడుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి బీజేపీని దూరం చేయడానికి అవసరమైన విధంగా ఆయన అడుగులు పడుతున్నట్లే ఉంది. సాధారణంగా పోలింగ్ లో తేడాలుంటే ఎన్నికల కమిషన్, బీజేపీపై జగన్ విమర్శలు చేయాల్సి ఉంది. అయితేవాటిని పక్కనపెడుతూ ఓటు చోరీ పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీపై ఆయన మండిపడుతుండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటేరాహుల్ గాంధీ బీహార్, మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు కానీ, ఆంధ్రప్రదేశ్ లో 12.5 శాతం పోలింగ్ ఓట్లతో తేడా వచ్చినప్పటికీ దాని ప్రస్తావన లేకపోవడాన్ని జగన్ ప్రశ్నించారు.
జగన్ ఆరోపణలతో...
చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇందుకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరించాని కూడా అన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు రాహుల్ తో టచ్ లో ఉన్నారంటూ జగన్ చేసిన ప్రయత్నం రాజకీయంగా మైండ్ గేమ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ లు రానున్న ఎన్నికల్లో తలపడుతున్న సందర్భంలో మరొకసారి చంద్రబాబుతో బీజేపీ చేతులు కలపకుండా చేయకుండా ఉండేదుకు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్లు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ పై కడా జగన్ విమర్శలు చేశారు.
గతంలో తెలంగాణలో...
మాణికం ఠాకూర్ చంద్రబాబు నాయుడును విమర్శించడం లేదని, ఆయన ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎత్తి చూపడం లేదని, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న తమపై విమర్శలు చేయడమంటే లోపాయి కారీ ఒప్పందం ఏమిటో అర్థమవుతుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం రాజకీయ ఎత్తుగడల్లో ఒక భాగమేనంటున్నారు. బీజేపీతో చంద్రబాబును దూరం చేస్తే తప్ప తనకు తిరిగి అధికారం దక్కదని భావించిన జగన్ ఇక ఇటీవల ఈ తరహా రాజకీయం మొదలుపెట్టారని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని రాహుల్ గాంధీతో ప్రచారంలో పాల్గొన్న ఫొటోలను కూడా వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటే ఆ దిశగా ప్రయత్నాలు జగన్ పార్టీ మొదలు పెట్టినట్లే అనుకోవాల్సి ఉంటుంది.