Ys Jagan : జగన్ ఇప్పటికీ.. ఎప్పటికీ మిత్రుడే.. అదే కారణం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా పరోక్షంగా తన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకపోయినా పరోక్షంగా తన సంబంధాలను కొనసాగిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెడుతున్న ప్రతి బిల్లుకు వైసీపీ ఆమోదిస్తుంది. అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతు ఇస్తూ వస్తుంది. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా జగన్ బీజేపీతో సఖ్యతగానే ఉంటూ వస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా జగన్ పట్ల సానుకూల వైఖరి ఉందంటారు. మరొకవైపు కాంగ్రెస్ కు శత్రువు కావడంతో సహజంగానే తనకు మిత్రుడిగా జగన్ ను బీజేపీ భావిస్తుంది. అందుకే జగన్ పై నమోదయిన అనేక కేసులు నేటికీ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా బహిరంగంగానే ఆరోపిస్తారు.
ఎన్నిక జరిగితే...
తాజాగా మరోసారి ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇండి కూటమి ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నెల 21వ తేదీన నామినేషన్లకు తుది గడువు కావడంతో ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్రయత్నిస్తుంది. అయితే వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు, లోక్ సభలో నలుగురు సభ్యుల బలం ఉంది. మొత్తం పదకొండు మంది సభ్యులు ఉండటంతో జగన్ సహజంగానే ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఫోన్ చేసి జగన్ తో మాట్లాడారు. తమకు మద్దతివ్వాలని అభ్యర్థించారు. తాను పార్టీ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతానని జగన్ చెప్పినప్పటికీ నిర్ణయం బీజేపీ వైపు ఉంటుందన్నది అందరికీ తెలిసిందే.
రాహుల్ పై విమర్శలు
జగన్ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారంటూ ఆరోపించారు. అలాగే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ జగన్ పై చేసిన విమర్శలతో పాటు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా జగన్ కు శత్రువుగా మారడంతో ఆ పార్టీ పక్షాన నిలబడే అవకాశం ఎంత మాత్రం ఉండదు. అందుకే అందులోనూ ఎన్డీఏకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవగల బలం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీని కాదని ఇండి కూటమి వైపు నిలబడే ఛాన్స్ లేదన్నది ఓపెన్ సీక్రెట్. కాకుంటే పార్టీ నేతల అభిప్రాయం తీసుకుని ప్రకటిస్తామని చెప్పడం మాత్రం కేవలం నామమాత్రమేనని అందరికీ తెలిసిందే.
పదేళ్లకు ముందే...
2014కు ముందు పార్టీ పెట్టిన తర్వాత బీజేపీ నాయకత్వం నేరుగా జగన్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించిందన్న ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. అయితే జగన్ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీ పెట్టడంతో పాటు తనను పదహారు నెలల పాటు జైలులో ఉంచారన్న కసి ఆయనలో ఇప్పటికీ ఉంది. అందుకే జగన్ నిర్ణయం బీజేపీకే అనుకూలంగా ఉండనుంది. ఏపీ రాజకీయాలను పరిశీలించిన వారికి ఎవరికైనాజగన్ బీజేపీకి మిత్రుడేనని చెబుతారు. రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ కి అనుకూలంగా ఉండే అవకాశమయితే అసాధ్యమన్నది వాస్తవం. అందువల్ల బీజేపీకి జగన్ ఇప్పుడే కాదు.. ఎప్పటికీ మిత్రుడేనని ఖచ్చితంగా చెప్పాలి.