Ys Jagan : జగన్ వార్నింగ్ లు పనిచేస్తాయా? ఏపీలో ఏం జరగుతోంది?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచారు. జనంలోకి వెళ్లడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు.

Update: 2025-09-12 07:26 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచారు. జనంలోకి వెళ్లడమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేయడాన్ని జగన్ తప్పుపడుతున్నారు. తమ హయాంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవనాలను నిర్మించామని, మౌలిక వసతులు కూడా అనేక కళాశాలల్లో కల్పించామని, కొన్ని చోట్ల మెడికల్ కళాశాలలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు పెద్ద స్కామ్ కు తెరలేపారని ఆరోపించారు. తన సొంత మనుషులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని దీని వెనక పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారే అవకాశముందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం వాదన...
అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం అంటే కేవలం భూములను కేటాయించడమే కాదని, అందుకు అవసరమైన అన్ని రకాలుగా వసతులతో పాటు ప్యాకల్టీని, అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాల్సిన గత ప్రభుత్వం మొండి గోడలను వదిలేసిందన్నారు. ఇంత భారీ సంఖ్యలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసి, వాటిని నిర్వహించడం ప్రభుత్వానికి భారంగా మారుతుందని కూటమి నేతలు చెబతున్నారు. అందుకే పీపీపీ మోడల్ లో ప్రయివేటు వారికి అప్పగిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతి మెడికల్ కళాశాలలో యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద ఉంటాయని, పేద విద్యార్థులకు ఇది ఉపయోగమేనని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించేకంటే ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో నాణ్యమైన వైద్య విద్య అందుతుందని అంటున్నారు.
అధికారంలోకి వస్తే
అయితే జగన్ మాత్రం తాము తిరిగి అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ పరం చేసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ టెండర్లలో పాల్గొనవద్దని కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. ఒకవేళ మెడికల్ కళాశాలను ఇప్పుడు తీసుకున్నా మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నుంచి ఖచ్చితంగా తీసుకుంటామని చెబుతున్నారు. అంటే ఒకరకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే అందుకు ముందుకు వచ్చే వ్యక్తులపై కూడా బెదిరింపులకు దిగుతున్నట్లు కనిపిస్తుందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, బెదిరిస్తే ఎవరూ భయపడే వారు లేరని అంటున్నారు. ఇదే సమయంలో ఖచ్చితంగా పబ్లిక్, ప్రయివేట్ పార్ట్ నర్ షిప్ పద్ధతిలో వైద్య కళాశాలలను నిర్వహిస్తామని కూటమి సర్కార్ చెబుతుంది. మొత్తం మీద ఏపీలో మెడికల్ వార్ మొదలయిందనే అనుకోవాలి. జగన్ కూడా స్వయంగా ఆందోళనల్లోకి దిగుతామని హెచ్చరించి ఈ అంశానికి మరింతగా పొలిటికల్ హీట్ పెంచినట్లయింది.



Tags:    

Similar News