2029 నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలంటే ఇంకా 17 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.ఈ ఏడాది జూన్ నాటికి 2 లక్షల ఇళ్లు, సెప్టెంబరుకు 1.60 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామన్న చంద్రబాబు దీపం 2.0 కింద మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. భవిష్యత్తులో పైప్డ్ గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. ఉచిత సిలిండర్ కు ఇచ్చే డబ్బులు ప్రతీ రెండు నెలలకూ ప్రజలకు చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు.ఇప్పుడు పైపు ద్వారా నీళ్లు వచ్చినట్టే గ్యాస్ కూడా వస్తుంది. పైప్డ్ గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చంద్రబాబుఅన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వాల్సి ఉన్నా గత పాలకులు దానిని నిర్వీర్యం చేశారని, ఇప్పుడు కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకూ ఈ పథకం కొనసాగించేలా చేసి ప్రతీ ఇంటికీ కుళాయి ద్వారా నీరందిస్తామని తెలిపారు.
ఉచితింగా విద్యుత్తు రావాలంటే....
ప్రతీ ఇంటికి సౌర ఫలకాలు పెట్టుకుంటే ఉచిత విద్యుత్ వస్తుందని, పంపుసెట్ కు కూడా బిగించుకుంటే విద్యుత్ అంతా ఉచితంగా వస్తుందని చంద్రబాబు తెలిపారు. వీటన్నింటినీ వినియోగించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానని, వీధిదీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజి, ఇంటింటి నుంచి చెత్త సేకరణ లాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని, 63 లక్షల మంది పేదలకు పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు. స్త్రీశక్తి ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకూ ఉచిత ప్రయాణం ఇస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 5 లక్షల మంది మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న చంద్రబాబు 2029 నాటికి మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది. చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక సేవతో పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు వచ్చే మహిళలకు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీలు స్వాగతం పలుకుతాయని, కొత్త ఏడాది రోజున రూ.56 కోట్ల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పేదలకు సహకారం అందించామని, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబుచెప్పారు. ఇప్పటి వరకూ గత పాలకులు మూడు ముక్కలాటతో రాజధానిని ముక్కలు చేశారని, అందుకే అమరావతికి చట్టబద్దత కల్పించేలా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశామని, ఇక్కడ అటానమస్ షిప్ యార్డు వస్తుందని, మత్స్యకారులకు అన్యాయం జరగదని హామీ ఇస్తున్నానని తెలిపారు.
వేట నిషేధ సయమంలో...
వేట నిషేధ సయమంలో ఇచ్చే ఆర్ధిక సాయం రూ.20 వేలకు పెంచామని, తమిళనాడు, పాండిచ్చేరి నుంచి వచ్చి చేపలు పట్టుకుంటే ఇక్కడ ఇబ్బంది వస్తోందన్నారు. గతంలో రూ.20 కోట్లు వెచ్చించి నిఘా పెట్టామని, కానీ వైసీపీ వచ్చాక అది పోయిందనిచెప్పారు. ఈ ప్రాంతం వారే ఇక్కడ చేపలు పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి, నెల్లూరు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. నిఘా కోసం రెండు బోట్లు మంజూరు చేశామని, దీని ద్వారా కాపలా పెంచేలా చర్యలు చేపడుతున్నామని చంద్రబాబు అన్నారు. సుపరిపాలన, సమర్ధవంతమైన పాలన ఇవ్వాలనే అనునిత్యం పనిచేస్తున్నామని, ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు వచ్చేలా వ్యవస్థను గాడిలో పెట్టాం. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పాలనను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.