Ys Sharmila : హస్తం కండువా కప్పేసుకున్న వైఎస్ తనయ

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్సార్టీపిని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు

Update: 2024-01-04 05:29 GMT

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తెలంగాణలో తాను స్థాపించిన వైఎస్సార్టీపిని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెను పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. షర్మిల వెంట దాదాపు నలభై మంది నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. నిన్ననే ఢిల్లీకి చేరుకున్న వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

మూడేళ్లకే...
దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత తిరిగి వైఎస్ కుటుంబం కాంగ్రెస్ గూటికి చేరుకున్నట్లయింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. 2021 జులై 8వ తేదీన వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. అయితే చివరి నిమిషంలో కాంగ్రెస్ గెలుపు కోసం తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మూడేళ్లలోనే వైఎస్సార్టీపీని మూసివేశారు.
అందుకే విలీనం చేశా...

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ తాను వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం గర్వంగా ఉందన్నారు. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారన్నారు. లౌకిక వాద పార్టీగా కాంగ్రెస్ దేశాన్ని కొన్ని దశాబ్దాలు ఏలిందన్నారు. తండ్రి వైఎస్సార్ అడుగు జాడ ల్లోనే తాను నడుస్తానని తెలిపారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. సెక్యులర్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేకపోవడం వల్లనే మణిపూర్ వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. తన తండ్రి కల కన్నట్లుగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకూ తాను శ్రమిస్తానని ఆమె అన్నారు. 

Tags:    

Similar News