Ys Sharmila : సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. యాజమాన్య ఏకపక్ష తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. హక్కుల సాధనకు ఉద్యోగులు పోరాటం చేస్తుంటే వారి ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం అత్యంత దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్న షర్మిల 58 సార్లు చర్చలు జరిపినా డిమాండ్లను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారంటే ప్రభుత్వమే 63 వేల మంది ఉద్యోగులను పరోక్షంగా సమ్మెలోకి ఉసిగొల్పుతున్నట్లు ఉందని అన్నారు.
ప్రభుత్వం పట్టువీడాలంటూ...
ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెపై పట్టువీడాలంటూ వైఎస్ షర్మిల విజ్ఞప్తి చేశారు. వెంటనే విద్యుత్ జేఏసీని మళ్ళీ చర్చలకు పిలవాలన్నారు. ఉద్యోగులు పెట్టిన 29 డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవన్న షర్మిల వాటిని తక్షణమే అమలు చేయాలన్నారు. 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 27 వేల మంది కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని కోరారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు అన్ లిమిటెడ్ మెడికల్ పాలసీ అమలు కావాలని అన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ జేఏసీ చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వైఎస్ షర్మిల తెలిపారు.