YS Sharmila : షర్మిలమ్మా.. పార్టీ ఇలా అయపోయిందేంటమ్మా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కనిపించడం లేదు. కేవలం పార్టీ చీఫ్ వైస్ షర్మిల మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో వైస్ షర్మిల కాకుండా మరొక నేత లేరా? అన్న అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం కాదన్న నిరాశ అన్నది తెలియదు. వైఎస్ షర్మిల నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక కావచ్చు. 2004 నుంచి 2014 వరకూ కేంద్ర మంత్రులుగా, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా పనిచేసిన వారు ఇప్పుడు వాయిస్ వినిపించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై ఆ పార్టీ అగ్ర నాయకత్వం పోస్ట్ మార్టం చేసుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
అనేక మంది సీనియర్ నేతలు...
ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ ను ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో నడుపుతున్నారన్న టాక్ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తుంది. జేడీ శీలం, పల్లంరాజు, రఘువీరారారెడ్డి, చింతా మోహన్ వంటి వారు కూడా బయటకు రావడం లేదు. గతంలో పార్టీ ఓడిపోయినా ఒకింత యాక్టివ్ గా ఉండే వీరు ఇప్పుడు మౌనంగా ఉండటం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే ఏదైనా పని ఉంటే నేరుగాఢిల్లీకి వెళుతున్నారు తప్పించి వీరు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా ఆసక్తిచూపడం లేదు. వైఎస్ ర్మిలను పీసీసీ చీఫ్ చేసిన తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయిందన్న నివేదికలు పార్టీ నాయకత్వానికి అందినా అంతకు మించిన నాయకత్వం ఎవరూ లేకపోవడంతో హైకమాండ్ కూడా ఏమీ చేయలేకపోతుందంటున్నారు.
ఏపీలో జీరో పెర్ ఫార్మెన్స్...
అన్ని రాష్ట్రాల్లో క్రమంగా పట్టు కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ లేని రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకుంటుందంటున్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ జీరో పెర్ ఫార్మెన్స్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇక ఆ పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న అనేక మంది నేతలు ఎక్కువ మంది వైసీపీకి,మరికొంత మంది టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఉన్న నేతలు లేటు వయసులో పార్టీ మారడం ఎందుకన్న భావనతో ఊరుకున్నారు కానీ, వారు కూడా రాజకీయంగా ఎదగాలని కోరిక ఉంటే పార్టీ ఎప్పుడో మారే వారు. చింతా మోహన్ అప్పడప్పుడు తన వాయిస్ ను వినిపిస్తున్నప్పటికీ ఆయన పెద్దగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.వైఎస్ తనయగా షర్మిల కాంగ్రెస్ పార్టీని ఇంచు కూడా ఎదిగేలా చేయలేకపో్యిందన్న విమర్శలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.