YSRCP : అక్కడ నుంచి సౌండ్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లుందిగా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను చెప్పినట్లుగానే ప్రత్యక్షంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను చెప్పినట్లుగానే ప్రత్యక్షంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాో జగన్ పర్యటించనున్నారు. అక్కడ ప్రభుత్వ మెడికల్ కళాశాలను పరిశీలిస్తారు. జగన్ తొలుత ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంచుకోవడానికి వెనక కూడా వ్యహముందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో తక్కువగానే పర్యటించారు. ఒకరకంగా చెప్పాలంటే అసలు వెళ్లలేదనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు వైసీపీని దారుణంగా దెబ్బేశాయి. ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే కాదనుకోండి.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పాయి.
ఇక్కడకే పరిమితమై...
అయితే వైఎస్ జగన్ ఇప్పటి వరకూ కోస్తాంధ్ర, రాయలసీమల్లోనే ఎక్కువగా పర్యటించారు. మిర్చి రైతుల సమస్యల కోసం గుంటూరులోనూ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రకాశం జిల్లా పొదిలిలోనూ, మామిడిరైతుల కోసం చిత్తూరు జిల్లాలోనూ పర్యటించారు. ఇక పల్నాడు జిల్లాకు బలవన్మరణానికి పాల్పడినవైసీపీ నేత విగ్రహావిష్కరణకు వెళ్లారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రకటించారు. అలాగే రుషికొండలో భవనాన్ని కూడా నిర్మించుకున్నారు. అయితే అక్కడి నుంచి పాలన చేపట్టేలోగా ఎన్నికలు రావడం ఫలితాలు తారుమారు కావడంతో ఉత్తరాంధ్ర వైపు జగన్ చూడలేదు. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రపై జగన్ దృష్టి పెట్టినట్లు కనపడుతుంది.
నర్సీపట్నం నియోజకవర్గంలో...
నర్సీపట్నం నియోజకవర్గంలోని మెడికల్ కళాశాలను ఆయనను పరిశీలించనున్నారు. అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇలాకాలో కాలుమోపబోతున్నారు. దీంతో పాటు ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహించానికి అవసరమైన ఏర్పాట్లు స్థానిక నేతలు చేస్తున్నారు. కేవలం మెడికల్ కళాశాల మాత్రమే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్, మత్స్యకారుల సమస్య వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ రోడ్ షోలో సాగనున్నారు. జగన్ నేరుగా అయ్యన్న కోటలో అడుగు పెడుతుండటంతో ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే ఉన్నట్లు కనపడుతుంది. మొత్తం మీద నర్సీపట్నం నియోజకవర్గం నుంచి జగన్ చేసే సౌండ్ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. దీంతో పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. జగన్ వస్తుండటంతో ఆయన రోడ్ షోకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. వైసీపీ నేతలు మాత్రం తాము ఖచ్చితంగా ముందు అనుకున్నట్లే వెళతామని చెబుతున్నారు. దీంతో జగన్ నర్సీపట్నం పర్యటన ఉద్రిక్తంగా మారనుంది.