Ys Jagan : వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారా? అందరికీ షాక్ ఇచ్చే డెసిషన్ ఉంటుందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ దసరాకు ముందు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ దసరాకు ముందు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు జగన్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగానూ, ఉత్కంఠగానూ ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కీలక సమావేశం ప్రారంభమయింది. వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జప్రారంభం కావడంతో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. గత పదిహేను నెలల నుంచి కూటమి ప్రభుత్వం వైఫల్యం, సూపర్ సిక్స్ హామీల అమలులో లొసుగులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది. . దీంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
రాజీనామాలపై చర్చ మాత్రమేనా?
అయితే అన్నింటికంటే ముఖ్యమైనది జగన్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాల విషయంలోనూ జగన్ ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం లేదని కానీ జీతాలను తీసుకుంటున్నారని, స్పీకర్ దగ్గర నుంచి అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. అయితే రాజీనామాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం సిద్ధంగా లేరని కూడా ఒక వాదన నడుస్తుంది. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఉప ఎన్నికల్లో ఎదుర్కొనడం కష్టమవుతుందని, అందుకు పులివెండుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉదాహరణ అని పలువురు నేతలు అంటున్నారు.
జగన్ పర్యటనలపై...
మరొకవైపు జగన్ ఈ సమావేశంలో రాజీనామాల విషయంలో చర్చించే అవకాశముండదని సీనియర్ నేతలు చెబుతున్నారు. అది ప్రచారం మాత్రమేనని, అయితే ఆయన జనంలోకి వెళ్లేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికే ఈ సమావేశాన్ని పెట్టారని అంటున్నారు. అందుకే అందరి అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఈ సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలను ఆహ్వానించార. సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరినట్లు అంటున్నారు. రాష్ట్రంలో జగన్ పర్యటనపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశముందని చెబుతున్నారు.