Ys Jagan : బెంగళూరు వదలవయ్యా.. అప్పుడు కానీ సెట్ అవ్వదంటున్నారే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారు

Update: 2025-10-22 09:00 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల్లో ఓటమి పాలయి దాదాపు రెండేళ్లకు దగ్గరపడుతుంది. ఇప్పటికైనా బెంగళూరు వదిలి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నేతలకు, ముఖ్యమైన కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్న డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. నెలలో ఇరవై నాలుగు రోజులు బెంగళూరులోనే జగన్ ఉంటున్నారు. కేవలం ఆరు రోజులు మాత్రమే తాడేపల్లికి వస్తున్నారు. అదీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకో.. నేతలతో సమావేశమవ్వడానికో ఆయన వస్తున్నారు. కానీ ఇకపై లాభం లేదని, ఇప్పటికే సమయం మించి పోయిందని, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయని, నేతలు కూడా బయటకు ఇంకా రావడం లేదని, దీనికి ప్రధాన కారణం జగన్ ఇక్కడ ఉండకపోవడమేనన్న అభిప్రాయం కార్యకర్తల్లో బలంగా కనిపిస్తుంది.

సీమలోనూ అదే సీన్...
ముఖ్యంగా గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ చాలా దారుణంగా దెబ్బతినింది. కానీ రాయలసీమలో అతి తక్కువ సార్లు మాత్రమే జగన్ పర్యటించారు. నిజానికి ఓటు బ్యాంకు, వైసీపీకి పట్టున్న రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. రాయలసీమలో వైసీపీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఇప్పటి నుంచే సీట్ల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పటిష్టమైన క్యాడర్ ఉన్న రాయలసీమను అలా వదిలేస్తే రానున్న కాలంలో ఎలా అన్న ప్రశ్న వినపడుతుంది. జగన్ మాత్రం ఇంకా టైముందని చెబుతున్నారు. కానీ అప్పటికి నష్టం తీవ్రత మరింత పెరిగే అవకాశముందన్న ఆందోళన పార్టీ నేతల్లో కనిపిస్తుంది.
క్షేత్ర స్థాయిలో నాయకత్వం...
నిజానికి ఇప్పటి వరకూ పార్టీకి క్షేత్రస్థాయిలో సరైన నాయకత్వం లేదన్నది వాస్తవం. నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ కమిటీలను నియమించాలని కొద్దిరోజుల క్రితం జగన్ నేతలను ఆదేశించినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. చాలా నియోజకవర్గ ఇన్ ఛార్జుల విషయంలోనూ ఇంకా జగన్ నుంచి క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో నియోజకవర్గాలను మార్చారు. అయితే అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు వెళ్లడం లేదు. మరొకవైపు జోగి రమేష్ వంటి నేతలు తాము మైలవరంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జగన్ బయటకు వస్తేనే తప్ప ఈ సమస్యలకు తెరపడదు. కానీ ఆయన బెంగళూరు వదిలి రాకపోవడంతో క్యాడర్ కు అదే బెంగ పట్టుకుందంటున్నారు.






Tags:    

Similar News