అంతొద్దు లోకేషా.. ఫస్ట్‌ క్షమాపణలు చెప్పు: ఎమ్మెల్యే గడికోట

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో

Update: 2023-06-10 01:49 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మిషన్‌ రాయలసీమ పేరుతో లోకేష్‌ హడావుడి చేయడంపై ఫైర్‌ అయ్యారు. లోకేష్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను లోకేశ్‌ చదువుతున్నాడని సెటైర్లు వేశారు. లోకేష్‌ నిర్వహించిన 'మిషన్‌ రాయలసీమ' కార్యక్రమాన్ని.. ప్రైవేట్‌ ఈవెంట్‌తో పోల్చారు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి. రాయలసీమలో డెవలప్‌మెంట్‌ అంటే.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ముందు, ఆ తర్వాత అని చూడాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు దేశం పార్టీ పాలనా హయాంలో ఏ ఒక్క పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని రోపించారు. రాయలసీమ గురించి కానీ, ఇక్కడి ప్రాజెక్టుల గురించి కానీ టీడీపీకీ ఎంత మాత్రం మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

టీడీపీ పాలనలో రాయలసీమకు అన్యాయం చేసినందుకు ముక్కును నేలకు రాసి సీమ ప్రజలకు తండ్రీకొడుకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో రెండు రోజుల్లో రాయలసీమలో లోకేష్‌ పాదయాత్ర పూర్తి కానుందని, ఈ ప్రాంతానికి చేసిన మోసానికి బాధ్యత వహిస్తూ చంద్రబాబును పిలిపించి క్షమాపణ చెప్పించాలని లోకేష్‌ను ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి కోరారు. గతంలో ఇక్కడి ప్రజలు చంద్రబాబుకు 3 సార్లు అవకాశం ఇచ్చారని, అయితే ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. మళ్లీ రాయలసీమను ఉద్ధరిస్తాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అప్పుడు కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుని, ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధికి ఏం చేయకుండా.. ఇప్పుడు ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు రాకుండా సాగునీటి ప్రాజెక్టుల‌కు అన్యాయం చేశార‌ని, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా సినిమాలు తీయించి కించ‌ప‌రిచార‌ని, ఇందుకు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందేనని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో వైసీపీ పథకాలను కాపీ కొట్టి.. ఆల్‌ ఫ్రీ అనడం చంద్రబాబు అవివేకాన్ని తెలియజేస్తోందన్నారు. తండ్రీకొడుకులు ఇష్టానుసారంగా మాట్లడటం సరికాదన్నారు. వారి హయాంలో అన్ని సామాజిక వర్గాలను మోసం చేసి.. ఇప్పుడు అధికారంలో వస్తే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

Tags:    

Similar News