Ys Jagan : జగన్ స్ట్రాటజీ మార్చారా? సీనియర్లకు ఇక చెక్ పెట్టనున్నారా?

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు ఏడు నెలల నుంచి నిస్తేజంగా కనిపిస్తుంది

Update: 2025-01-21 11:37 GMT

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు ఏడు నెలల నుంచి నిస్తేజంగా కనిపిస్తుంది. ఇంత దారుణమైన ఓటమిని చవి చూడటంతో నేతల నుంచి కార్యకర్తల వరకూ ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఓటమి సంభవించినా కేవలం పదకొండు సీట్లకే తాము పరిమితమవుతామని వారు ఊహించలేదు. దీంతో పార్టీలో ఉండటం వేస్ట్ అన్న అభిప్రాయానికి వచ్చి నేతలు వెళ్లిపోతున్నారు. కీలకమైన నేతలు, జగన్ వారిపై నమ్మకం ఉంచి టిక్కెట్లు ఇచ్చిన వారు, మంత్రిపదవులు కట్టబెట్టిన వారు కూడా రాజీనామా చేశారు. ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నా ఉన్నవారితో పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ భావించి త్వరలోనే తాను రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తానని ప్రకటించారు అంతే కాదు కొత్త నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలని కూడా జగన్ భావిస్తున్నారు.

సీనియర్లతో ఇబ్బందులని...
సీనియర్ నాయకులైతే రాజకీయాల్లో విలువలు లేకుండా వ్యవహరిస్తారన్న నమ్మకంతో జగన్ ఉన్నారని తెలిసింది. వారు అధికారం ఉంటేనే పక్కన ఉంటారని, దాదాపు 80 శాతం మంది సీనియర్ నేతలు అధికారం కోల్పోయిన వెంటనే పార్టీకి దూరమవుతారని కూడా భావించి కొత్త నాయకత్వానికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా కొత్త నాయకత్వం కోసం వెదుకులాటను జగన్ అండ్ టీం ప్రారంభించినట్లు వార్తలు అందుతున్నాయి. తన రాష్ట్ర పర్యటనలో కాకపోయినా తర్వాత అయినా వారిని నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించి ఇప్పటి నుంచే వారిని జనంలోకి పంపి అందరికీ పరిచయం చేయాలన్న యోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు తెలిసింది.
నూతన నాయకత్వం ఎంపికలో...
నూతన నాయకత్వం, యువకులు అయితే తనను నమ్ముకుని ఉంటారని జగన్ భావించడమే ఇందుకు కారణం. అందుకే ఏడు నెలల్లోనే అధికార పార్టీ అయిన కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. తాను లేకపోయినా నాయకత్వం ఎలా ఉందో పరిశీలినకు తనకు ఉపయోగపడుతుందని భావించి ఈ రకమైన కార్యక్రమాలకు తెరదీశారంటున్నారు. నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుని అందుకు అనుగుణంగా యాక్టివ్ గా ఉన్న ఐదుగురు యువకులైన నేతల పేర్లను తెప్పించుకుంటున్నారు. అందులో ఒకరికి నియోజకవర్గాల పగ్గాలను అప్పగిస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వారిని అభ్యర్థులుగా ప్రకటించవచ్చన్న ఆలోచనతో జగన్ ఉన్నారని చెబుతున్నారు.
సీనియర్ నేతలు కూడా...
అయితే జగన్ ఆలోచించిన కొందరు సీనియర్ నేతలు మాత్రం ఈ కార్యక్రమాలకు యాక్టివ్ అయినట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకూ మౌనంగా ఉన్న నేతలందరూ రైతు సమస్యలు, విద్యుత్తు ఛార్జీల పెంపుదల వంటి కార్యక్రమాల్లో సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. ముఖ్యమైననేతలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకింత ఆందోళనకు దిగుతున్నారు. ఇదే సమయంలో కేసులు ఎదుర్కొంటున్న నేతలు మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమపై ఏదో ఒక కేసు పెడతారని భావించి వారు ఈ ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారికి మాత్రం వచ్చే ఎన్నికల్లో మినహాయింపు ఇస్తారని చెబుతున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుండటం కూడా ఈ కార్యక్రమాల ద్వారా కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసుకునేందుకు సులువు అవుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. మొత్తం మీద జగన్ స్ట్రాటజీ పనిస్తుందా? లేదా? అన్నది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News