Kodali Nani : గెట్ రెడీ.. భయ్యా... టైం వచ్చేసింది

వైసీపీ నేతలు వరసగా అరెస్ట్ అవుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో మరో టాపిక్ ఏపీలో నడుస్తుంది

Update: 2025-02-13 06:37 GMT

వైసీపీ నేతలు వరసగా అరెస్ట్ అవుతున్నారు. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తో మరో టాపిక్ ఏపీలో నడుస్తుంది. తర్వాత ఎవరు? తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ పార్టీని థిక్కరించి చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడమే కాకుండా, లోకేష్ పై సయితం అనేక వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఇక వల్లభనేని వంశీపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయనను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత నెక్ట్స్ అరెస్ట్ ఆ వైసీపీ నేత వైపు అన్ని వేళ్లూ చూపుతున్నాయి.

టీడీపీ టార్గెట్ లో ప్రధానంగా...
ఆయనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. టీడీపీ టార్గెట్ లో కొడాలి నాని ప్రధానంగా ఉన్నారు. కొడాలి నానిని కూటమి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓడించింది. టీడీపీలో ఎదిగిన కొడాలి నాని తర్వాత వైసీపీలోకి మారిపోయారు. వల్లభనేని వంశీ తరహాలోనే చంద్రబాబు, లోకేష్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో పాటు అమరావతి రైతులు యాత్రగా బయలుదేరి గుడివాడ కు వచ్చినప్పుడు అక్కడ జరిగిన అల్లర్లతో కూడా ఆయన టీడీపీ అధినాయకత్వానికి కంటగింపుగా తయారయ్యారు. బాలకృష్ణ నుంచి ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసే కొడాలి నాని ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఎక్కువ సమయం హైదరాబాద్ కే పరిమితమయ్యారు.
కార్యకర్తలు, నేతల ఒత్తిడితో...
గుడివాడకు అప్పుడప్పుడూ వచ్చిపోతున్నారు. ఆయనపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన అనుచరులను అరెస్ట్ చేశారు. కొడాలి నాని ప్రధాన అనుచరులను ఇటీవల అరెస్ట్ చేయడంతో నాని అరెస్ట్ కూడా త్వరలోనే ఉంటుందని అందరూ భావించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం తొలుత వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారిని అలా వదిలిపెడితే ఎలా ఊరుకుంటామని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో టీడీపీ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. కొడాలి నానిని కంట్రోల్ చేయాలని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేతలు చెబుతూనే ఉన్నారు.
వంశీ అరెస్ట్ తర్వాత...
ఇప్పుడు వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. కొడాలి నాని కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. కొడాలి నానిని తొలిసారి ఓడించి ఊపుమీదున్న టీడీపీ నేతలు ఆయనను అరెస్ట్ చేసి తమ సత్తా ఏంటో చూపాలని భావిస్తున్నారు. వైసీపీ హయాంలో అనేక మంది కొడాలి నాని చేతిలో ఇబ్బదులు పడ్డారు. వారి చేత ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఫిర్యాదులు అందిన వెంటనే కొడాలి నానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ అగ్రనాయకత్వం చెబుతున్నా కొడాలి నానీ గెట్ రెడీ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.


Tags:    

Similar News