Ys Jagan : జగనూ ఇప్పుడనుకుని ఏం లాభం? అప్పుడే చేసి ఉంటే ఇంత నష్టం జరగక పోయేది కాదుగా?
విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన కొంత పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది.
విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన కొంత పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. విజయసాయిరెడ్డి అంత సులువుగా లొంగే వ్యక్తి కాదన్నది పార్టీలో అందరికీ తెలుసు. ఎంతో బాధపడి, అవమానాలు పొందితే తప్ప అది జరగదన్న విషయాన్ని జగన్ మర్చిపోయి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు. జగన్, విజయసాయిరెడ్డి సంబంధం భారతి సిమెంట్ కన్నా గట్టిది అంటూ గత పదేళ్ల పాటు ప్రచారం జరిగింది కూడా వైసీపీలోనే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఆ కుటుంబానికి వెన్నంటే ఉంటున్న విజయసాయిరెడ్డి అంతటి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారంటే అందులో సాయిరెడ్డి తప్పిదం పక్కన పెడితే తన తప్పులను జగన్ తెలుసుకోకుంటే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నమ్మకంగా ఉన్న ఇద్దరు...
క్విడ్ ప్రోకో కేసుల్లో 2014 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ జైలులోకి వెళితే ఆయన వెంట జైలుకు వెళ్లిన వారిలో ఇద్దరు ఇప్పుడు పార్టీతో పాటు జగన్ తో తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయారు. జగన్ తో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలు జీవితం అనుభవించారు. జగన్ కు విజయసాయిరెడ్డి అత్యంత నమ్మకంగా వ్యవహరించారు. అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత ఆయనకు రెండుసార్లు రాజ్యసభ పదవి ఇచ్చి ఉండవచ్చు గాక, కానీ సాయిరెడ్డి తన కుటుంబానికి చేసిన సాయాన్ని జగన్ మర్చిపోతే ఎట్లా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తన ఆస్తుల విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ సాయిరెడ్డి చేసిన సాయాన్ని మర్చిపోతే ఎలా అని కొందరు సూటిగానే జగన్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు.
మనసువిప్పి మాట్లాడితే తప్పేముంది?
సాయిరెడ్డి చేసింది తప్పే కావచ్చు. కానీ దానికి దారి తీసిన పరిస్థితులను కూడా జగన్ తెలుసుకోవాలి కదా? అన్నది జగన్ కే తిరిగి కౌంటర్ వేస్తున్నారు కొందరు. ఎందుకంటే సాయిరెడ్డి చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేనలను విమర్శించేందుకు అందరు నేతల కంటే ముందుంటారు. ఎక్స్ లోనూ, మీడియా సమావేశాల ద్వారానూ సాయిరెడ్డి ప్రతి రోజూ వారిపై విరుచుకుపడే వారు. అలాంటి సాయిరెడ్డిని పిలిపించుకుని ఒకరోజు మనసు విప్పి జగన్ మాట్లాడితే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని టీడీపీకి తెలిసినప్పుడు వైసీపీ అధినేత జగన్ కు తెలియకుండా ఉంటుదనుకోవడం హాస్యాస్పదమంటున్నారు.
టీడీపీలోకి టచ్ లోకి వెళ్లారంటూ గగ్గోలు పెట్టడం కంటే?
నిజమే సాయిరెడ్డి కోటరీ అంటూ అన్నారంటే గత కొంతకాలంగా ఆయన జగన్ ను కలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లే కదా? అని మరికొందరు నిలదీస్తున్నారు. సీనియర్ నేత, కుటుంబానికి అండగా ఏళ్ల నుంచి ఉన్న నేతకు ఇలా కలవకుండా అవమానించడం కరెక్టేనా జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. సాయిరెడ్డికి ఈ పరిస్థితి ఉంటే ఇక మామూలు నేతల పరిస్థితి ఏంటన్నది కూడా అర్థం కాకుండా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే సాయిరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసినప్పటికీ వైసీపీ నేతల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలిసి సహజంగా రాజకీయ ప్రయోజనం కోసం టీడీపీ టచ్ లోకి వెళుతుంది. దానిని తప్పు పడితే ఎలా అన్న ప్రశ్నకు జగన్ నుంచి సమాధానం రాకపోవచ్చు కాని, ఎవరైనా అదే చేస్తారని, అందులో టీడీపీ తప్పిదం ఏముందని పలువురు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.