Ys Jagan : నమ్మకద్రోహం చేసిన వారికి నో ఎంట్రీ... గేట్లు క్లోజ్ అయినట్లే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారన్న అభిప్రాయంలో ఉనట్లుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారన్న అభిప్రాయంలో ఉనట్లుంది. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే అదే అర్ధమవుతుంది. తాను నమ్మి పదవులు ఇచ్చిన వారంతా కష్టకాలంలో వదలి పెట్టి వెళ్లిపోతున్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని వారిని ఆపేందుకు ఎలంటి ప్రయత్నమూ చేయలేదు. అందుకు ఇగో అడ్డువస్తుంది. వెళ్లేవారిని ఆగమంటే ఆగుతారా? అన్న ధోరణిలో జగన్ ఉన్నారని ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నారు. ఇక ఎవరిని నమ్మాలి? అని జగన్ ఇటీవల జరిగిన నేతల సమావేశంలో జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారంలో ఉన్నప్పడు పదవులు కట్టబెట్టినా తాను ఏం చేశానని నమ్మకద్రోహం చేసి వెళుతున్నారని జగన్ ఆవేదన చెందినట్లు సమాచారం.
అత్యంత ఆప్తులే...
వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసులురెడ్డి, విజయసాయిరెడ్డి లు వెళ్లిపోవడం పైనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కిలారు రోశయ్యకు కూడా వాళ్ల మామకు మాత్రమే కాకుండా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా అధికారం కోల్పోయిన వెంటనే పార్టీని వదిలివెళ్లిపోవడంపై జగన్ ఒకింత నిరాసక్తతను ప్రదర్శించారట. వీరికి తాను ఏం తక్కువ చేశానంటూ వైసీపీ నేతల వద్ద జగన్ వ్యాఖ్యానించారంటే వారి విషయంలో పార్టీ అధినేత ఎంతగా హర్ట్ అయ్యారో చెప్పకనే తెలుస్తుంది. కొందరు పదవులు ఇవ్వకపోయినా పార్టీని వదలి వెళ్లలేదని, అలాంటి వారికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అందలం ఎక్కించడం గ్యారంటీ అని కూడా చెబుతున్నారట.
కొందరు తిరిగి రావడానికి...
ఈ సందర్భంగా నేతలు ఆసక్తికరమైన విషయాన్ని జగన్ ముందు నేతలు ఉంచారట. పార్టీని వీడిన వెళ్లిన నేతలు అక్కడకు వెళ్లినా హ్యాపీగా లేరని, వారు ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి వచ్చే అవకాశముందని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారని తెలిసింది. అయితే జగన్ వెంటనే తడుముకోకుండా నమ్మకద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదని, వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసి వారిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని అన్నట్లు తెలిసింది. అలా పార్టీలో చేర్చుకుంటే క్యాడర్ తో పాటు ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళతాయని, అందుకే అటువంటి ప్రతిపాదనలు ఎవరు తెచ్చినప్పటికీ తన వద్దకు మాత్రం తేవద్దని జగన్ ఖరాఖండిగా చెప్పినట్లు వైసీపీలో టాక్ వినిపిస్తుంది.
వాళ్లతోనే తన ప్రయాణం...
అంటే ఇటీవల కాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలకు ఇక నో ఎంట్రీ అని జగన్ చెప్పినట్లు తెలిసింది. ఎంతటి వారైనా, చివరకు బంధువులకు కూడా నో ఛాన్స్ అంటూ ఆయన క్లారిటీని నేతలకు ఇచ్చినట్లు తెలిసింది. తనతో కష్టంలో ఉన్న వాళ్లతోనే తన ప్రయాణం ఉంటుందని, భయపడి వెన్నుచూపి పారిపోయే వాళ్లతో పొలిటికల్ జర్నీ తాను చేయలేనని కూడా జగన్ తెగేసి చెప్పినట్లు అంటున్నారు. ఎవరైనా వెళతామన్నా తనకు అభ్యంతరం లేదని, తనకు అధికారం ముఖ్యం కాదని, తాను మరో ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయాలు చేస్తానన్న నమ్మకం ఉందని, తనతో నమ్మకంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని కూడా జగన్ సీనియర్ నేతల ముందు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. దీంతో వెళ్లిన వారికి గేట్లు క్లోజ్ అయినట్లేనని పార్టీ నుంచి అందుతున్న సమాచారం