Ys Jagan : భయపడితే రాజకీయాలు చేయలేం.. జైళ్లకు వెళ్లడానికి సిద్ధం కావాల్సిందే
భయపడితే నేడు రాజకీయాలు చేయలేమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.
భయపడితే నేడు రాజకీయాలు చేయలేమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఈ కాలంలో రాజకీయాలంటే అన్నింటికీ తెగించాలని అన్నారు. జైళ్లకు వెళ్లాలన్నా, కేసులు పెడతారన్నా ఎలాంటి భయం లేకుండా ముందుకు సాగితేనే రాజకీయం చేయగలమని చెప్పారు. రామచంద్రాపురం, పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లతో, స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో ఈరోజు వైయస్ జగన్ సమావేశం అయ్యారు.
ధైర్యంగా ఉంటేనే...
ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతుందని, అందుకు అనుగుణంగా మానసికంగా సిద్ధమవ్వాలని జగన్ పిలుపు నిచ్చారు. భయపడి సరెండర్ అయితే రాజకీయ భవిష్యత్ మాత్రం ఉండదని కూడా జగన్ తెలిపారు. ధైర్యంతో పాటు తెగించి పోరాడగలిగితేనే రాజకీయంగా మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. లేకపోతే రాజకీయం అనేది చేయలేమని అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయాలు ప్రస్తుతం అలాగేఉన్నాయని జగన్ అన్నారు. అవసరమైతే జైళ్లకు వెళ్లాలని, బెయిల్ వస్తుందని, కేసులకు భయపడి పోతే మాత్రం రాజకీయాలు చేయలేమన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.
ఈసారి కార్యకర్త నెంబరు వన్...
మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న జగన్ ఈసారికార్యకర్త నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పారు. జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుదని జగన్ మరోసారి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని తాను చూస్తున్నానని, అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్యాయం చేసిన వారికి ఖచ్చితంగా సినిమా చూపించడం ఖాయమని కూడా జగన్ అన్నారు. మనకూ టైం వస్తుందన్న జగన్ అప్పటి వరకూ వెయిట్ చేయాలంటూ నేతలకు జగన్ భరోసా ఇచ్చారు.