Ys Jagan : ఫిబ్రవరి వచ్చేసిందన్నా.. ఇక కదిలేది ఎప్పుడో చెప్పన్నా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనవరి మూడో వారంలో జిల్లాల పర్యటన చేస్తామని చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనవరి మూడో వారంలో జిల్లాల పర్యటన చేస్తామని చెప్పారు. జనవరి వెళ్లిపోయింది. ఫిబ్రవరి వచ్చేసింది. అయినా ఇప్పటి వరకూ జగన్ జిల్లాల పర్యటనపై క్లారిటీ రాలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలపై పోరుబాటకు వైసీపీ శ్రేణులకు పిలుపు మీద పిలుపు ఇస్తున్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలు చేయడం లేదని నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన వైసీపీ ఆందోళనకు దిగుతుంది. అయితే కేవలం ఆందోళనలు చేసినంత మాత్రాన క్యాడర్ లో ఊపు రాదు. నేతల్లో నెలకొన్న నిరుత్సాహం పోయి ఉత్సాహం పెరగదు. ఇప్పటికీ అనేక మంది నేతలు పార్టీ పట్ల పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అసలు పార్టీలో లేరనే అనిపిస్తుంది.
క్యాడర్ లో ఉత్తేజం నింపడానికి...
నిజానికి జగన్ రాష్ట్ర పర్యటనతోనే కొద్దిగా కార్యకర్తల్లో చలనం వస్తుంది. అది అందరికీ తెలిసిందే. జగన్ బయటకు వస్తే నేతలతో పాటు క్యాడర్ కూడా జనంలోకి వస్తారు. అది పార్టీకి లాభం చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ జగన్ జనంలోకి రాలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లు జనానికి దూరంగా ఉన్నారన్న పేరు తెచ్చుకున్నారు. కేవలం బటన్ నొక్కడానికే ఆయన పరిమితమయ్యారన్న విమర్శలను కూడా సొంత పార్టీ నేతలు కొట్టిపారేయలేరు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జరిగిందదే కాబట్టి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ బయటకు రాకపోతే తామెందుకు రావాలని నేతలు కూడా ఎదురు ప్రశ్నించే అవకాశముంది.
నేతలు దూరమవుతున్నా...
ఇప్పటికే జగన్ పట్టించుకోకపోవడంతో అనేక మంది దూరమవుతున్నారు. సన్నిహితులు కూడా రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. అయినా జగన్ లో చలనం లేదు. బయటకు వచ్చి క్యాడర్ కు ధైర్యం చెప్పాల్సిన సమయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు వ్యయం చేసినా గత ఎన్నికల్లో గెలవలేకపోవడం, జగన్ బొమ్మ పనిచేయకపోవడంతో క్రమంగా ఇమేజ్ గ్రాఫ్ పడిపోయినట్లే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిన పెట్టేందుకు జగన్ బయటకు రావాలని కొందరు ముఖ్యమైన నేతలు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా క్యాడర్ మనోభావాలను తెలుసుకుని వ్యవహరించాలని కోరుతున్నారు.
లండన్ నుంచి వచ్చి...
నిన్న మొన్నటి వరకూ జగన్ లండన్ పర్యటనకు వెళ్లి వచ్చారు. బహుశా ఆయన జెట్ లాగ్ తో ఇబ్బందులు పడుతున్నట్లుంది.బెంగళూరులోనే ఉన్నారు. రేపు జగన్ తాడేపల్లికి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. కీలక నేతలతో ఆయన సమావేశమయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై కూడా ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. మరొక వైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలను కూడా టీడీపీ క్రమంగా తమ సొంతం చేసుకుంటుందన్న ఆవేదనను వైసీపీ నేతలు కక్కలేక మింగలేక బయటకు చెప్పలేక సతమతమవుతున్నారు. జగన్ బయటకు వచ్చి పార్టీని కాపాడకుంటే ఉన్న వారిలో ఎక్కువ మంది బయటకు వెళ్లే అవకాశముందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.