YSRCP : అందిన నివేదికలను చూసి జగన్ షాక్ అయ్యారా? విస్తుపోతున్న లీడర్లు
వైసీపీ అధినేత జగన్ అన్ని నియోజకవర్గాల నుంచి నేతల పెర్ ఫార్మెన్స్ పై నివేదికలను తెప్పించుకుంటున్నట్లు సమాచారం.
అధికారంలో లేనప్పుడు గుర్తింపును నేతలు కోరుకుంటారు. ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భావిస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా యాక్టివ్ గా ఉన్న నేతలకు ఈసారి చంద్రబాబు కేబినెట్ లో ఎక్కువ మందికి అవకాశం దక్కిందంటారు. నిమ్మల రామానాయుడు, సవిత, హోమంత్రి వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్ లాంటి వారికి చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. వీరంతా కేవలం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉండి, అనేక కేసులు ఎదుర్కొనడమే కాకుండా తెగించి పోరాటం చేయడమే కాకుండా పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలనే ఈ అవకాశం ఇచ్చారు.
పోరాడిన వారికి...
సామాజికవర్గాలను కొంత తూకం పాటించినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన వారికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ప్రాధాన్యత దక్కుతుంది. అది రాజకీయాలను గమనిస్తున్న వారికి ఎవరికైనా తెలుసు. కానీ వైసీపీలో మాత్రం నేతలు అలా యాక్టివ్ గా ఉండేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. అధికారంలోకి వచ్చినా తమకు మంత్రి పదవి అవసరం లేదన్న భావనలో ఉన్నట్లుంది. కొందరు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్ నాథ్, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్లు మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. మిగిలిన వారు పెద్దగా కనిపించడం లేదు. అంతే కాదు పార్టీ పిలుపు నిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా వారి భాగస్వామ్యం అంతగా లేదు.
నేతల పెర్ ఫార్మెన్స్ చూసి...
ఇప్పుడ వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో ఒకింత సీరియస్ గానే ఉన్నారని తెలిసింది. అన్ని నియోజకవర్గాల నుంచి నేతల పెర్ ఫార్మెన్స్ పై నివేదికలను తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల అంటే జూన్ 4వ తేదీన వైఎస్ జగన్ ఏపీ వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కానీ అందులో కొందరు నేతలు అలా వచ్చి ఇలా వెళ్లారని తెలిసింది. కేవలం పది మంది వరకూ నేతలు మాత్రమే బాగా కష్టపడి కార్యకర్తలను సమీకరించడంలో కానీ, జనంలోకి తమ కార్యక్రమాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారని వైఎస్ జగన్ కు నివేదికలు అందినట్లు తెలిసింది. మిగిలిన వారు కొందరు అసలు కార్యక్రమంలో పాల్గొనకుండా తమ ముఖ్య అనుచరులచేత మమ అనిపించి ఫొటోలు కేంద్ర కార్యాలయానికి పంపినట్లు పసిగట్టారు.
ఈసారి అధికారంలోకి వస్తే...
దీంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారి కష్టపడిన నేతలకు మాత్రమే కేబినెట్ లో స్థానం కల్పించే అవకాశముందన్న ప్రచారం ఊపందుకుంది. అయినా నేతలు మాత్రం కేసులకు భయపడి బయటకు రావడం లేదు. 175 నియోజకవర్గాల్లో కేవలం ఇరవై నుంచి పాతిక నియోజకవర్గాల్లోనే నేతలు యాక్టివ్ గా ఉన్నట్లు వైసీపీ అధినేతజగన్ కు అందిన నివేదికలలో తేలిందని తెలిసింది. ఈ నివేదికలను చూసిన జగన్ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారట. రాయలసీమ ప్రాంతంలో కూడా కొందరు నేతలు బయటకు రాకపోవడంపై జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. వారిని పిలిచి క్లాస్ పీకాలా? లేక ప్రత్యామ్నాయంగా మరొక నేతకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలన్న దానిపై ఆలోచిస్తున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.