YSRCP : ఎక్కడో తేడా కొడుతుంది భయ్యా.. ఏదో జరుగుతుంది.. ఎన్నికల ముందే తెలుస్తుందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు

Update: 2025-05-21 08:53 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతతో తమను మరోసారి అధికారంలోకి ప్రజలు తెచ్చుకుంటారని విశ్వసిస్తున్నారు. జగన్ లో మాత్రం ఫుల్లు కాన్ఫిడెన్స్ కనపడుతున్నప్పటికీ నేతల్లో మాత్రం అది కనిపించడం లేదు. నలభై శాతం ఓట్లు వచ్చి పదకొండు స్థానాలు రావడంపై వైసీపీ నేతలు నేటికీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేసినా పార్టీ ఇంత దారుణమైన ఓటమికి గల కారణాలను నేతలు తమ కిందిస్థాయి నేతలతో మాట్లాడుతూ తెలుసుకుంటున్నారు. వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ ఇంత దారుణమైన ఓటమికి గల కారణాలపై నేతలు ఒక క్లారిటీకి వచ్చినట్లు కనపడుతుంది.

నేతల నుంచి సూచనలు వస్తున్నా...
అందుకే వైసీపీలో నేతల వాయిస్ ఛేంజ్ అవుతుంది. జగన్ తన పద్ధతి మార్చుకోవాలంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివాళ్లు వ్యాఖ్యానించారు. అదే సమయంలో గుడివాడ అమర్నాధ్ లాంటి నమ్మకమైన నేతలు కూడా వాలంటీర్లను దగ్గరకు తీసుకుని తాము ఓటమి పాలయ్యామని అనేశారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్లు అయితే జగన్ మెతక వైఖరి వల్లనే ఓడిపోయమాని బహిరంగంగానే చెబుతున్నారు. ఇలా ఎవరికి వాళ్లు ఓటమికి గల కారణాలను ఏడాది కాలం నుంచి విశ్లేషించుకుంటూ వస్తున్నారు. జగన్ తీరు మార్చుకోవాలని కూడా కొందరు సూచిస్తున్నారు.
అందువల్లనే ఓడామంటూ...
అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోక పోవడం వల్లనే ఓడిపోయామని బాధపడే వారు కూడా వైసీపీ నేతల్లో ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ వల్లనే ఏపీలో కూటమి ఇన్ని సీట్లు గెలిచిందన్న నమ్మకంతో ఉన్న వైసీపీ నేతలు వచ్చే ఎన్నికల్లోనైనా బీజేపీతో పొత్తుకు జగన్ ప్రయత్నించాలని సలహాలు ఇస్తున్నారు. ఇటీవల కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఇంత దారుణమైన ఓటమిని చవి చూశామని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లోనైనా కమలంతో దోస్తీకి దిగాలంటూ తాను జగన్ కు సూచిస్తానని కూడా నల్లపురెడ్డి అనడం చర్చకు మరింత దారి తీసింది.
అన్ని బిల్లులకు మద్దతిచ్చి...
కానీ జగన్ ఇప్పటి వరకూ బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోలేదు. 2014లోనే వైసీపీని బీజేపీ పొత్తుకు ఆహ్వానించింది. అయితే కొన్ని వర్గాలు తమకు దూరమవుతాయని భావించిన జగన్ బీజేపీతో ప్రత్యక్ష పొత్తుకు దిగలేదు. అప్పటి నుంచి బీజేపీతో పరోక్షంగా సత్సంబంధాలు నెరుపుతున్నప్పటికీ, నేరుగా ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తూనే వస్తుంది. అంటే బీజేపీకి బి టీంగానే వైసీపీ వ్యవహరిస్తుంది. కానీ నేరుగా పొత్తు పెట్టుకునేందుకు జగన్ అంగీకరించలేదు. ఈసారి కూడా అదే రకంగా జగన్ వెళతారని కొందరు చెబుతుండగా, మరికొందరు మాత్రం కమలంతో కలసి వెళితేనే సక్సెస్ అవుతామని అంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీ టీడీపీ, జనసేనతో పొత్తులో ఉంది. ఆ రెండు పార్టీలను కాదని వైసీపీ వెంట బీజేపీ ఎందుకు నడుస్తుందన్న ప్రశ్నకు మాత్రం వైసీపీ నేతల మధ్య సమాధానం లేదు.


Tags:    

Similar News