Ys Jagan : అంత వద్దులే కానీ.. వెనక్కు తిరిగి చూసుకో భయ్యా

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈసారి తనదే అధికారం అన్న భావనలో ఉన్నారు.

Update: 2025-02-06 09:08 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఈసారి తనదే అధికారం అన్న భావనలో ఉన్నారు. శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాకమునుపే అప్పుడే తనదే వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ లో విశ్వాసం నింపడానికి ఈ వ్యాఖ్యలు ఆయన చేసి ఉండవచ్చు. అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తనదే మళ్లీ అధికారం అనుకుంటేనే పార్టీని నడపగలుగుతారు. అయితే జగన్ మాత్రం ఒక డిఫరెంట్ స్టయిల్ లో పాలిటిక్స్ చేస్తున్నారు. నిజానికి జగన్ ది చిన్న వయసు. పిన్న వయసులోనే పార్టీని స్థాపించి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దానిని రెండోసారి నిలుపుకోలేకపోయారు.

ఐదేళ్లు ఏం చేశామో...?
అధికారంలో ఉన్నప్పుడు తాను ఏం చేశానో ఆయనకు గుర్తు లేదని జగన్ మాటలను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. అధికారం లేనప్పుడు మాత్రమే క్యాడర్ కలలో కూడా గుర్తుకు వచ్చేలా ఆయన వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పుపడుతున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి క్యాడర్ ను పూర్తిగా విస్మరించి, వారిని అస్సలు పట్టించుకోకుండా, ఎమ్మెల్యేలను సయితం కలవకుండా మోనార్క్ లాగా వ్యవహరిస్తే రిజల్ట్ ఎలా ఉంటాయో 2024 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా జగన్ వైఖరిలో మార్పు రాలేదంటున్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం. వారినే ఐదేళ్లు దూరం చేసుకున్న జగన్ నేడు దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ఎంత మేరకు సఫలమవుతాయన్నది చూడాల్సి ఉంది.
కూటమిని ఎదుర్కొనాలంటే?
మరోవైపు కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. వాటిని ఎదుర్కొనాలంటే ఇంటికే పరిమితమై డైలాగులు చెబితే సరిపోదు. జనంలోకి రావాలి. జనంలో తిరిగి వారి సమస్యలపై పోరాడితేనే ప్రజలు కూడా వెంట నడుస్తారు. ఎన్నికలు పూర్తి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన గడప దాడి బయటకు రావడం లేదు. దీనిని నేతలు కూడా తప్పు పడుతున్నారు. ఇప్పటికీ ఒక కోటరీతోనే జగన్ మమేకమై వారిపైనే ఆధారపడి వారి సలహాలతోనే ముందుకు వెళుతున్నారన్న సమాచారంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కూడా ఎవరూ రావడం లేదు. ఆయనే తనకు అవసరమైన నేతలను పిలిపించుకుని బుజ్జగింపులు చేసుకోవాల్సి వస్తుంది.
మరో ముప్ఫయి ఏళ్లా?
దీంతో పాటు తాను మరోసారి అధికారంలోకి వస్తానని క్యాడర్ కు, నేతలకు భరోసా ఇవ్వడంలో తప్పు లేదు కానీ మరో ముప్ఫయి ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించడం అతి విశ్వాసమే అవుతుంది. ముందుగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఊరి మీద పడి భూ దందాలు చేసినా మౌనంగా ఉన్న తీరును ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. కానీ నేతలను, ద్వితీయ శ్రేణీ నాయకులను కట్టడి చేసే ప్రయత్నం నాడు జగన్ చేయకపోవడంతోనే అంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జరిగిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా నాదే అధికారం అంటూ కూర్చుంటే మాత్రం మరోసారి మూలన కూర్చో పెట్టడం ఖాయమని చెప్పక తప్పదు. ఇప్పటికైనా రియాలిటీలోకి వచ్చి జనంతో మమేకమై విశ్వాసం సంపాదించుకోగలగాలి. అప్పుడే ప్రజలు అండగా నిలుస్తారు.




Tags:    

Similar News