Ys Jagan : వైసీపీ విన్నూత్న కార్యక్రమం.. ఐదు వారాల పాటు హామీలపై ప్రజల్లోకి?
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి పాలన పూర్తయి ఏడాది కావడంతో ఇక హనీమూన్ పీరియడ్ ముగిసిందన్న జగన్ ఇకపై ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల్లోకి తీసకెళ్లాలని ఐదు వారాల పాటు సుదీర్ఘ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు. దీనికి రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫేస్టో అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన క్యూ ఆర్ కోడ్ ను కూడా జగన్ ఈ సమావేశంలో విడుదల చేశారు.
ఇంటింటికీ కార్యక్రమం....
ఇంటింటికి దాన్ని చేర్చేలా కార్యక్రమాన్ని నేతలు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమి పాలనపై ఏడాది కాలంలోనే తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని, ఇంత తక్కువ కాలంలో దారుణమైన వ్యతిరేకతను ఏ ప్రభుత్వమూ చవి చూసి ఉండకపోవచ్చని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇచ్చిన హామీలను అమల కాని విషయం ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమ అరెస్ట్ లు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు మోసాలపై...
తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరిగిందన్న జగన్ చంద్రబాబు ఏడాది పాలనలో దగా తప్ప మరేదీ లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని చెప్పడం సిగ్గుచేని అన్నారు. చంద్రబాబు మ్యానిఫేస్టోలో ఏం చెప్పాడని..ఇప్పుడు ఎలా మోసం చేస్తాడని అన్నింటిని గ్రామ గ్రామాన తీసుకుపోయే కార్యక్రమం ఇదేనంటూ ఆయన చంద్రబాబు మ్యానిఫేస్టోను గుర్తుకు తెస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఐదు వారాల పాటు పూర్తి చేయాలని అన్నారు.