YSRCP : జగన్ ఆ హామీ ఇస్తేనే మళ్లీ గెలుపట.. లేకుంటే క్యాడర్, లీడర్ వెనకడుగే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకుంటానని ముందు చెప్పాల్పి ఉంటుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకుంటానని ముందు చెప్పాల్పి ఉంటుంది. అప్పుడే నేతల్లో కాస్త ధైర్యం కలుగుతుంది. 2019 ఎన్నికల్లో తొలి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఆయన ఓటమికి కారణాలయ్యాయి. అందుకే గతంలో తీసుకున్న నిర్ణయాలు మళ్లీ అధికారంలోకి వస్తే అమలుచేయబోనన్నహామీ జగన్ నుంచి స్పష్టంగా రావాల్సి ఉంటుంది. అప్పటి వరకూ కార్యకర్తలు, లీడర్లు వచ్చినప్పటికీ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మాత్రం పనిచేయరు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలను కూడా ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టాయి.
కనెక్షన్ కట్ చేసి...
ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశాడు. అసలు ఎమ్మెల్యేలకు, ప్రజలకు మధ్య సంబంధం లేకుండా జగన్ తానే ఒంటిచేత్తో రాష్ట్రాన్ని నడిపించాలన్న బిల్డప్ ఇచ్చేశాడు. బటన్ నొక్కుతున్నాను కదా? ఈవీఎంలో కూడా ఫ్యాన్ పై నొక్కుతారని భ్రమించి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పుడువైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. కేవలం వారు మనసులో దాచుకోవడం లేదు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ తన తీరును మార్చుకోవాలని కూడా నేతలు సూచిస్తున్నారంటే నేతలు ఏ మాత్రం హర్ట్ అయ్యారో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి.
వాలంటీర్ల వ్యవస్థను...
జగన్ వాలంటీర్ల వ్యవస్థను దూరం పెట్టాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. తాను కూడా ఈ విషయాన్ని జగన్ కు ఎప్పుడో చెప్పానంటూ ఆయన అన్నారు. అంటే వాలంటీర్ల వ్యవస్థ పార్టీని ఎంత డ్యామేజీ చేసిందో జగన్ కు ఈ పాటికి అర్థమయి ఉండాలి. కార్యకర్తలకు పనులు అప్పజెప్పాల్సిన జగన్ వాలంటీర్లను తీసుకుని వారి నెత్తిపై పెట్టడంతో ఇటు కార్యకర్తలు, అటు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ప్రజలకు కూడా అసలు వైసీపీ నేతలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో స్థానిక నాయకత్వానికి, ప్రజలకు మధ్య కనెక్షన్ కట్ అయింది. ఈ కారణంగానే గత ఎన్నికల్లో ప్రజల వద్దకు వాలంటీర్లు వెళ్లలేదు. కార్యకర్తలు వెళ్లలేదు. ఫలితంగా పదకొండు సీట్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది.
మద్యం దుకాణాల విషయంలోనూ...
ఇక మద్యం దుకాణాల విషయంలోనూ జగన్ ది తప్పుడు నిర్ణయమేనని వైసీపీనేతలు బాహాటంగా చెబుతున్నారు. ఎప్పుడూ లేనిది చరిత్రలో తొలిసారి ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించడమేంటని, ఆ దుకాణాలు ఉంటే వేలంలో తాము సాధించుకుని పదో పరకో సంపాదించుకునే అవకాశాన్ని కూడా జగన్ పోగొట్టారని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి తమ జేబు నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టుకున్నా తర్వాత ఐదేళ్ల పాటు సంపాదించుకునే మార్గం లేక ఆర్థికంగా నష్టపోయామన్న ఆవేదన అందరిలోనూ ఉంది. అందుకే జగన్ తొలుత వాలంటీర్లు, మద్యం దుకాణాలపై తన విధానాన్ని చెప్పాలని వైసీపీ నేతలే ప్రశ్నించడం ఇప్పుడు పార్టీ నాయకత్వానికి మింగుడుపడటం లేదు.