Ys Jagan : వెయిట్ చేయడమే ఉత్తమమా? మారిన జగన్ ఆలోచన
వైసీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాల పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడకపోవడమే మంచిదా? బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ తరహాలో కొంత కాలం వెయిట్ చేయడం మంచి పని అని ఆయన భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. జగన్ కూడా సేమ్ టు సేమ్ బెంగళూరులోని తన ప్యాలెస్ లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చిపోవండంతో పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు రావడం మినహా పెద్దగా ఎక్కడకు పర్యటించడం లేదు. కేసీఆర్ తరహాలోనే ప్రభుత్వంపై ఎదురయ్యే వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందన్న అంచనాలో జగన్ ఉన్నట్లుంది.
అందుకే వాయిదా...
అందుకే ఆయన జిల్లాల పర్యటన కూడా ఇప్పట్లో పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలలో మార్పు వచ్చి వారు అనుకూలంగా మారిన తర్వాత మాత్రమే జనంలోకి వెళితే బాగుంటుందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం. అందుకోసమే జగన్ ఎప్పటికప్పుడు తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసిన జగన్ అసెంబ్లీకి కూడా రావడం లేదు. కేసీఆర్ తరహాలోనే బడ్జెట్ సమావేశాలసమయంలో గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రమే వచ్చిపోతున్నారు. అంతే తప్ప శాసనసభ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ప్రజలు మార్పు కోరుకుంటే...
ప్రజలు మార్పు కోరుకుంటే మరోసారి విజయం దక్కుతుందని, అంతోటి దానికి ఇప్పటి నుంచే ఎండనకా, వాననకా తిరగడం వృధా అన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది. ఖర్చుతో పాటు దూసుకు వచ్చే పార్టీ క్యాడర్ తో ఇబ్బందులు తప్ప మరేదీ ఉండదని, ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నందున ఇప్పుడిప్పుడే జనంలోకి వచ్చినా ఎన్నికల సమయానికి ఆ హైప్ ఉండదని అంచనా వేస్తున్నారు. అంతేకకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆటోమేటిక్ గా తన పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందన్న అంచనాలో వైఎస్ జగన్ ఉన్నారు. ప్రస్తుతం రైతులు, మహిళలు కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, అది మరింత పెరిగేంత వరకూ వెయిట్ చేయడమే మంచిదని భావిస్తున్నారు.
రాజధాని అమరావతి కోసం...
మరొకవైపు లక్ష కోట్ల రూపాయలతో రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా ఏమీ మాట్లాడకపోవడమే మంచిదని జగన్ అనుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతి తప్ప మరో జపం చేయరని తెలిసినా జనం ఆయనకే ఓటేసినందున ప్రజల్లోనే విసుగు వచ్చేంత వరకూ వేచిచూడాలని జగన్ బెంగళూరులోనే ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం మరో నలభై వేల ఎకరాలను సేకరించాలన్న ప్రభుత్వం ఆలోచనను చాలా మంది తప్పుపడుతున్నారని, ప్రజలు కూడా ఈ విషయంపై చంద్రబాబును వ్యతిరేకిస్తారని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ దూకుడుగా వెళ్లేకంటే వెయిట్ చేయడమే మంచిదన్న భావనలో ఉన్నట్లుంది.