Ys Jagan : పొదిలి ఘటన చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2025-06-14 06:57 GMT

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. " పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది రైతులు, ప్రజలు తరలివస్తే, మేం వెళ్తున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు" అని జగన్ ధ్వజమెత్తారు..

సంయమనంతో వ్యవహరించడంతో...
"కాని ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన, అక్కడున్న 40 వేల మంది ప్రజలు, రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారూ? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా?" అని జగన్ ప్రశ్నించారు.
రాళ్లు విసిరింది టీడీపీ వాళ్లే...
"పైగా ఉల్టా రాళ్లు మీవాళ్లు విసిరితే, మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే, అన్యాయంగా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారూ? రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా…, ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది" అని జగన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.


Tags:    

Similar News