Ys Jagan : జగన్ వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారా? వారి వద్దకే వెళతారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గత ఎన్నికల్లో దెబ్బకొట్టిన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనపడుతుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గత ఎన్నికల్లో దెబ్బకొట్టిన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనపడుతుంది. తనకు గత ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చాయంటే అందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు అని ఆయన అంచనా వేస్తున్నారు. అగ్ర కులాల ఓటర్లకు ఆయన దూరమయ్యారు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కావచ్చు. బటన్ నొక్కి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల కావచ్చు. పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇలా అన్నింటిలో కొన్నిసామాజికవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అగ్రవర్ణాలు దూరమయినట్లు జగన్ ఎన్నికల తర్వాత జరిపిన విశ్లేషణలో తేలింది.
వారినే నమ్ముకుంటూ...
ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో వైసీపీ దూరమవ్వడానికి ఈ వర్గాల ప్రజలేనని వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకోసం జగన్ ఈసారి అధికారంలోకి రావాలంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై ఆధారపడి రాజకీయం చేస్తే మాత్రం చెల్లదని, మిగిలిన వర్గాల వారిని కూడా కలుపుకుని పోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా త్వరలోనే జగన్ రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్యలుతో సమావేశమవుతారని తెలిసింది. ఇందుకు సరైన తేదీలను నిర్ణయించాలని, తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కాకుండా ఈ సమావేశాలు ఎక్కడకక్కడ ఏర్పాటు చేయాలని జగన్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసింది.
అక్కడకే వెళ్లి...
కాపులతో సమావేశం రాజమండ్రిలోనూ, వైశ్యులతో సమావేశం విజయవాడలోనూ, కమ్మ సామాజికవర్గం ముఖ్యులతో గుంటూరులోనూ, రెడ్డి సామాజికవర్గం ముఖ్యలతో తిరుపతి లేదా నెల్లూరులోనూ, బ్రాహ్మణ సామాజికవర్గం ముఖ్యులతో విశాఖపట్నంలోనూ సమావేశాలు ఏర్పాటు చేయాలని, అందులో తాను స్వయంగా పాల్గొని వారికి తాను వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఏమేం చేయగలమో చెప్పనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఎటూ సంక్షేమ పథకాల్లో తనకు తిరుగులేదు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తనకు అండగా ఉంటాయని, వారికి తోడు వీరు కూడా కలిస్తే ఇక తన గెలుపు ఎవరూ ఆపలేరన్న నమ్మకంతో ఉన్నారు.
రెడ్డి సామాజికవర్గం కూడా...
గత ఎన్నికలలో రెడ్డి సామాజికవర్గం కూడా జగన్ కు దూరమయింది. దీనికి అనేక కారణాలు కనిపించాయి. కాంట్రాక్టు పనులు చేసినా వారికి డబ్బులు చెల్లించకపోవడంతో పాటు పనులు ఇవ్వకపోవడం, పదవుల్లో నియమించకపోవడం, 2014 నుంచి ఆర్థికంగా తమ డబ్బులు పోగొట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా గుర్తించకుండా కొందరికే అవకాశమివ్వడంతో రెడ్డి సామాజికవర్గం కూడా దూరమయింది. తనకు ముఖ్యమైన వారిని మినహాయించి ఎక్కువ మందిని ఇతర సామాజికవర్గాల వారిని నియమించుకోవడంతో అసంతృప్తికి గురైన రెడ్లు గత ఎన్నికలలో దెబ్బేశారు. ఇప్పుడు వారిని దగ్గరకు తీసుకునే పనిలో ఉన్నారని తెలిసింది. మొత్తం మీద జగన్ తన గేమ్ లో కొన్ని మార్పులు చేసినట్లు స్పష్టమవుతుంది.