BJP : చౌదరి ఆశలు నెరేవేరవటగా...కనుచూపు మేరలో కుర్చీ కనపడటం లేదట
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తనకు గుర్తింపు దక్కకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలోని పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. మాజీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి దగ్గర నుంచి అనేక మంది తమకు పదవులు దక్కలేదన్న అసహనంతో ఉన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న తమకు పదవులు దక్కకపోవడంతో పాటు పార్టీలో పేరు వినిపించని నేతలకే ప్రాధాన్యత దక్కుతుందని భావిస్తున్నారు. అందులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒకరు. సుజనా చౌదరి రాష్ట్ర రాజకీయాలంటే ఆయనకు పొసగదు. ఆయనకు కేంద్ర రాజకీయాలంటేనే ప్రీతి. అందుకే రెండుసార్లు రాజ్యసభకు అడిగి మరీ ఎంపిక చేయించుకున్నారు. ఒకసారి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సుజనా చౌదరికి ఎంపీ టిక్కెట్ దక్కలేదు.
పార్లమెంటు సీటును ఆశించి...
వాస్తవానికి విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు. తన కొలీగ్ సీఎం రమేష్ కు మాత్రం అనకాపల్లి ఎంపీ సీటు దక్కింది. సుజనా చౌదరి అయిష్టంగానే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన తనకు బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కుతుందని గట్టిగా భావించారు. తాను సీనియర్ నేత కావడంతో పాటు అనేక అంశాల్లో టీడీపీతో తనకున్న సంబంధాలు కూడా మంత్రి పదవిని తెచ్చిపెడతాయని ఆయన ఆశించారు. కానీ కేంద్ర నాయకత్వం ఆలోచన వేరే విధంగా ఆచరణలోకి పెట్టడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చారు.
భవిష్యత్ లోనూ....
దీంతో ఆయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. సామాజికవర్గం కోణంలో తనకు భవిష్యత్ లోనూ, అంటే ఈ ఐదేళ్లలో మంత్రి పదవి చంద్రబాబు నాయుడు కేబినెట్ లో దక్కే అవకాశం లేదని ఆయనకు అర్థమయింది. దీంతో ఆయన తన పశ్చిమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. సుజనా చౌదరి కేంద్రమంత్రిగా పనిచేసి కేవలం శాసనసభ్యుడిగా మిగిలిపోవడంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నటప్పటికీ విపక్షాలపై విమర్శల విషయంలో ఆయన పెద్దగా ఆసక్తి చూపకపోవడం కారణమిదేనని అంటున్నారు. చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటికే నలుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఉండటంతో మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు ఇటు టీడీపీ, అటు బీజేపీ ఆసక్తి చూపదన్న అంచనాలతో ఆయన అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు.