Sujana Chodhary : చౌదరి గారికి కాలుతున్నట్లుందిగా...చల్లార్చడం ఎవరి వల్ల అవుతుందో?

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి హ్యాపీగా లేరని తెలుస్తుంది

Update: 2025-09-30 07:04 GMT

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి హ్యాపీగా లేరని తెలుస్తుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లను ఇప్పించిన వ్యక్తి ఇప్పుడు బీజేపీలో టిక్కెట్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానాన్ని సుజనా చౌదరి ఆశించారు. కానీ తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా వెళ్లింది. మరొకస్థానమయినా కేటాయిస్తారనుకున్నారు. కానీ చివరకు బీజేపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరిని పరిమితం చేసింది. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన సుజనా చౌదరి ఇప్పుడు కేవలం పశ్చిమ నియోజకవర్గానికే లిమిట్ కావాల్సివచ్చింది. పార్టీ అధ్యక్ష పదవిని ఆశించినప్పటికీ అది మాధవ్ కు దక్కడంతో ఆయన హతాశులయ్యారు.

కేంద్రంలో చక్రం తిప్పిన తనకు...
ఇక బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటు దక్కుతుందని భావించినప్పటికీ అది కూడా చివరకు దక్కలేదు. నామమాత్రపు ఎమ్మెల్యేగానే ఆయన మిగిలిపోవాల్సి వచ్చింది. గెలిచారు కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అడపా దడపా పర్యటిస్తున్న సుజనా చౌదరి ఎక్కువ సమయాన్ని హైదరాబాద్ లోనే గడుపుతున్నారని అంటున్నారు. ఆయన ఢిల్లీ ప్రయాణాలు కూడా పెద్దగా చేయడం లేదు. ఒకనాడు ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద దగ్గరగా మసిలిన సుజనా చౌదరి నేడు పశ్చిమ నియోజకవర్గంలోని బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలతో ముచ్చటించుకోవాల్సి వస్తుంది. ఇది ఆయనలోని అసహనం బయటకు అప్పుడప్పుడు కనిపిస్తుంది. బీజేపీపై ఆగ్రహమా? కూటమి ప్రభుత్వంపై కోపమా? అన్నది తెలియదు కానీ మొత్తం మీద ఆయన అసంతృప్తిలో ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో,,,
ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూటమి ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడుస్తున్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ పాలనలానే నడుస్తుందని అన్నారు. అమరావతి రైతుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతున్నా వారి సమస్యలను పరిష్కరించలేదన్నారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై గతంలో విపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేశామని, అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలవుతున్నప్పటికీ దానిపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలా సుజనా చౌదరి తమ అక్కసును ఇలా వెళ్లగక్కుతున్నారని అంటున్నారు. మరి సుజనా చౌదరి ఆంతర్యమేంటో తెలియదు కానీ మొత్తం మీద ఆయన కొంత అసహనంగానే ఉన్నట్లు కనిపిస్తుంది.


Tags:    

Similar News