Vijaya Sai Reddy : సాయిరెడ్డి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ పడిందా?
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక జగన్ ను హెచ్చరించారా? అన్నది తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం. విజయసాయిరెడ్డికి ఇంకా జగన్ పట్ల సానుకూలత ఉందన్నది మాత్రం వాస్తవం. జగన్ వెంట కొన్నేళ్ల పాటు నడిచి జగన్ కు అన్నిరకాలుగా అండగా నిలిచిన విజయసాయిరెడ్డి 2024 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనం కలిగించింది. పార్టీ ఓటమి పాలయినప్పుడు హస్తినలో ఉండి జగన్ కు అండగా నిలవాల్సిన సాయిరెడ్డి రాజీనామాతో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న దానికి ఉదాహరణగా చెప్పుకోవాలి. విజయసాయిరెడ్డి జగన్ నుంచి దూరమవుతారని ఎవరూ ఊహించలేదు. అనుకోలేదు కూడా.
బీజేపీలో చేరాలనుకున్నా...
కానీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనుకున్నారు. కానీ ఆయన చేరలేదు. చేరలేదా? బీజేపీ నేతలు చేర్చుకోలేదా? అన్నది పక్కన పెడితే తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు కనపడుతుంది. అయితే జగన్ నీడగా ఉన్న విజయసాయిరెడ్డిని ఏపీలోని ఏ పార్టీ చేర్చుకునే అవకాశం లేదు. ఏదైనా చేర్చుకుంటే ఒక్క బీజేపీ మాత్రమే ఆ సాహసం చేయాలి. కానీ బీజేపీ రాష్ట్ర నేతలు సాయిరెడ్డి చేరికకు మోకాలడ్డే అవకాశాలున్నాయి. అందుకే ఆయన జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ను ప్రదర్శిస్తున్నారంటున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కూడా జగన్ ను హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతున్నా.. జగన్ మేలుకోవాలని సూచించినట్లే అర్థమవుతుందంటున్నారు.
సానుకూలంగా ఉన్నారా?
జగన్ కూడా సాయిరెడ్డి పట్ల సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే విజయసాయిరెడ్డిని పార్టీలోకి తిరిగి చేర్చుకుంటే మిగిలిన వారికి కూడా అవకాశమిచ్చినట్లవుతుందని ఇప్పటి వరకూ ఓకే చెప్పలేదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డికి, ఇతర నేతలకు మధ్య చాలా తేడా ఉంది. సాయిరెడ్డి కుటుంబ సభ్యుడితో సమానం కావడంతో తిరిగి వైసీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రంపార్టీ ఓడిపోయినప్పుడు కష్ట కాలంలో జగన్ కు తోడుగా ఉండాల్సిన సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి పార్టీకి మరింత డామేజ్ చేసిన వారిని తిరిగి చేర్చుకోవద్దంటూ పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే జగన్ నిర్ణయమే ఫైనల్ కావడంతో విజయసాయిరెడ్డి చేరికపై ఎవరూ అంచనాలు వేయరన్నది మాత్రం వాస్తవం. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనడానికి మళ్లీ సాయిరెడ్డి రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.