Vijaya Sai Reddy :అంత సులువు కాదు.. సాయిరెడ్డీ.. ఎంత మంది.. ఇలా?

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ పెట్టి ఏం చేయాలని భావిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది

Update: 2025-11-25 09:02 GMT

రాజకీయ పార్టీ పెట్టడం సులువే. కానీ దానిని నడపటమే కష్టం. రాజీనామా చేసినంత సులువు కాదు.. పార్టీని నడపటం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాక్యూమ్ లేదు. అలాంటి చోట మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ పెట్టి ఏం చేయాలని భావిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది. గతంలోనూ విజయసాయిరెడ్డి మీడియా ఛానల్ ను పెడతానని ప్రకటించారు. తాజాగా రాజకీయ పార్టీని పెడతానని చెప్పారు. అయితే రాజకీయ పార్టీ నడపాలంటే కేవలం పేరు రిజిస్ట్రేషన్ చేస్తేనే సరిపోదు. దానికి కావాల్సిన అంగ, అర్థ బలాలుండాలి. కొత్త పార్టీ పెట్టి గతంలో అనేక మంది చేతులు కాల్చుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. ఏపీలో మరొక కొత్త పార్టీ అవసరమా? అన్న చర్చ కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత నడుస్తుంది.

రాజ్యసభ సభ్యత్వానికి...
వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా వదులుకున్నారు. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి మాత్రం ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. అవసరం వస్తే పార్టీ ఏర్పాటు చేయడానికీ వెనకాడనని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పరాజయం తర్వాత పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలు ఈ సందర్భంగా వెల్లడించారు. పలు వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా దానికి లొంగలేదని చెప్పారు. జగన్‌ చుట్టూ ఉన్న కొంత మంది తప్పుదారి పట్టించడంతో పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. కట్టుబాటు లేని వారి మాటలు నమ్మొద్దని జగన్‌కు సూచించినట్లు చెప్పారు.
పవన్ తో సత్సంబంధాలు...
విజయసాయిరెడ్డి తాను రాజీనామా చేసిన తర్వాత రైతుగా మారాలనుకున్నానని, తాను వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెంట్‌నని గుర్తుచేశారు. ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని, తాను వెళ్లే ఉద్దేశ్యమూ లేదని తెలిపారు. అయితే పరిస్థితులు బలవంతం చేస్తే పార్టీ ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమేనని చెప్పారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో రెండు దశాబ్దాల స్నేహం ఉందని, ఆయనపై ఎప్పుడూ విమర్శలు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయనని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. అయితే విజయసాయిరెడ్డి తాను పార్టీ పెట్టినా రాజకీయంగా ఏ మేరకు నిలదొక్కుకుంటారు? లేక పవన్ తో సత్సంబంధాలున్న కారణంతో జనసేనలో చేరతారా? అన్నది త్వరలోనే తేలనుంది. పార్టీ పెడితే చేతులు కాల్చుకున్నట్లేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News