Vijaya Sai Reddy : సాయిరెడ్డి బీజేపీలో చేరికను అడ్డుకున్న దెవరో తెలుసా?
మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారు.
మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారు. అయితే ఆయన ఎప్పుడో బీజేపీలో చేరాల్సింది. అయితే ఒక రకంగా వైసీపీ ఆడిన నాటకంలో ఇది వికటించిందంటున్నారు. విజయసాయిరెడ్డి నేరుగా వైసీపీ నుంచి వచ్చి బీజేపీలో చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి ఉంది. కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు అవసరం బీజేపీకి లేకపోతే 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు చేరిన తరహాలోనే విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో చేరే వారు. కానీ సాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే టీడీపీ అంగీకరించదు. అందుకే బీజేపీలో ఆయన చేరికకు రెడ్ సిగ్నల్ పడిందంటున్నారు.
జగన్ పై విమర్శలు చేయకపోవడంతో..
బీజేపీలో చేరడానికే విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకపోయాని ఆయన చుట్టూ ఉన్న కోటరీపైన మాత్రమే విమర్శలు చేశారు. జగన్ ను మంచి నేతగానే ఇప్పటికీ మాట్లాడుతున్నారు. రెండు సార్లు రాజ్యసభ పదవి ఇచ్చిన జగన్ కు, అదే సమయంలో జగన్ ఆస్తుల చిట్టా అంతా తెలిసిన విజయసాయిరెడ్డి బంధాన్ని ఎవరూ అంత తేలిగ్గా తుంచలేరు. సాయిరెడ్డి వైసీపీ నుంచినేరుగా బయటకు వచ్చి బీజేపీలో చేరితే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించి, ఆ పార్టీకి, రాజ్యసభకు రాజీనామా చేసిపడేశారు సాయిరెడ్డి. అయితే టీడీపీ మాత్రం సాయిరెడ్డిని జగన్ కోవర్టుగానే భావిస్తుంది. అందుకే బీజేపీలో సాయిరెడ్డి చేరికను అడ్డుకుందంటున్నారు.
ఎంత ప్రయత్నిస్తున్నా...
విజయసాయిరెడ్డి తనకు పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలున్నాయంటున్నారు. చంద్రబాబు తో తనకు విభేదాలు లేవని చెబుతున్నారు. కానీ విజయసాయిరెడ్డిని ఎవరూ నమ్మడం లేదు.పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధపడటం లేదు. సాయిరెడ్డి, జగన్ కు మాత్రమే కాదు వైఎస్ కుటుంబంతో ఆయనకు కొన్ని దశాబ్దాలుగా ఉన్న సంబంధాలు వేరు చేయలేనివి. ఆడిటర్ గా వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తులను పరిరక్షించేందుకు ఆయన కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే సాయిరెడ్డి టీటీడీ మెంబర్ అయ్యారు. అందుకే జగన్ కోవర్టుగానే విజయసాయిరెడ్డిని చూస్తున్నారు. సాయిరెడ్డిని ఏ రాజకీయ పార్టీ నమ్మక పోవడంతో తిరిగి జగన్ వద్దకు చేరడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.