Tirumala : తిరుమల శ్రీవారికి భారీ విరాళం
తమిళనాడుకు చెందిన వర్ధమాన్ జైన్ టీటీడీకి ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి తమ భక్తి ప్రపత్తులను చాటు కున్నారు
తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే తమకు తోచినంత హుండీలో వేసి స్వామి వారి చెంతకు వచ్చినట్లు గుర్తుంచుకుంటారు. అందుకే తిరుమల హుండీ ఆదాయం నిత్యం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ఇక సంపన్నులు తమకు తోచినంత విరాళాన్ని ప్రకటిస్తూ ఉంటారు. అన్నదానానికి, తిరుమల తిరుపతి దేవస్థానం నడిపించే ట్రస్ట్ లకు తమ విరాళాన్ని అందించి స్వామి వారి సేవలో తాము కూడా భాగస్వామ్యులయ్యామని తృప్తి చెందుతుంటారు.
రెండు సంస్థలకు...ఆరు కోట్లు...
తాజాగా ఈరోజు ఒక భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఏకంగా ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి తమ భక్తి ప్రపత్తులను చాటు కున్నారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జై అనే భక్తుడు టీటీడీ ట్రస్ట్ కు ఈ విరాళాన్ని అందచేశారు. ఇందులో ఐదు కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే ఎన్బీబీసీ ఛానల్ కోసం, మరో కోటి రూపాయలు గోసంరక్షణ ట్రస్ట్ కు కేటాయించాల్సిందిగా వర్ధమాన్ జైన్ కోరారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వర్ధమాన్ జైన్ ఆరు కోట్ల రూపాయల డీడీని అందచేశారు.