Vangaveeti Radha : వెతుక్కుంటూ రావాల్సిన పదవి కోసం ఎదురుచూపులు ఎన్నాళ్లు?

బెజవాడ నాయకుడు వంగవీటి రాధా రాజకీయంగా చాలా నష్టపోతున్నారు

Update: 2025-10-15 08:14 GMT

బెజవాడ నాయకుడు వంగవీటి రాధా రాజకీయంగా చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే దశాబ్ద కాలం నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధాకు ఎందుకో రాజకీయ పదవి దక్కడం లేదు. వంగవీటి రంగా కుమారుడిగా బలమైన కాపు సామాజికవర్గం నేతగా వంగవీటి రాధాకు సాధారణంగా పదవి వెతుక్కుంటూ రావాల్సి ఉంది. కానీ వంగవీటి రాధా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకు కారణం కులం కార్డు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిందంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో వంగవీటి రాధాను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అన్ని పార్టీలూ...
వంగవీటి రాధా ఇప్పటికే అన్ని పార్టీలూ మారారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ ఇలా నాలుగు పార్టీలు మారిన వంగవీటి రాధాకు చివరకు పోటీ చేయడానికి కూడా స్థానం దక్కని పరిస్థితి నెలకొనడంతో ఆయన రంగా అనుచరుల్లో బాధ అంతా ఇంతా కాదు. వంగవీటి కుటుంబానికి ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పేరు ఉంది. రంగా పేరుతో పాటు ఆయన విగ్రహాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రంగాను పేదల దేవుడిగా భావిస్తారు. కేవలం కాపు సామాజికవర్గానికి మాత్రమే కాకుండా రంగాకు అన్ని కులాల నుంచి అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. కానీ వంగవీటి రాధా విషయంలో మాత్రం అది రివర్స్ అయిందంటున్నారు. రాధా కూడా పెద్దగా రాజకీయాలను పట్టించుకోకుండా తిరుగుతుండటం అనుచరులను కొంత అయోమయానికి గురి చేస్తుంది.
ఇటీవల జరిగిన...
ఇక ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వంగవీటి రాధాను పిలిపించుకుని మాట్లాడారు. దీంతో వంగవీటి రాధాకు కూడా పదవి రెడీ అయిందన్న ప్రచారం జరిగింది. ఆయనను అందుకే లోకేశ్ పిలిచి మరీ మాట్లాడారంటున్నారు. వంగవీటి రాధా హైదరాబాద్ లో ఉంటే అమరావతికి పిలిచి పదవిపై లోకేశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గంట సేపు ఇద్దరి భేటీ కొనసాగింది. అయితే ఇటీవల వంగవీటి రాధా తన కుమార్తె వేడుకకు సందర్భంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ హాజరు కావడంతో టీడీపీ సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కనిపించాయి. అయినా వంగవీటి రాధాను టీడీపీ వదులుకోదని, ఆయనకు పదవి గ్యారంటీగా దక్కుతుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News