Amit Sha : అమిత్ షా ఆంధ్రపర్యటన అసలు రహస్యమదేనా?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన విజయవాడలో చేస్తున్న పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన విజయవాడలో చేస్తున్న పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమిత్ షా అసలు రావడానికి కారణాలు మాత్రం ప్రారంభోత్సవాలు కాదని, పార్టీ అధ్యక్ష పదవికి కరెక్ట్ అయిన నేతను ఎంపిక చేయడానికే వచ్చారని అర్థమవుతుంది. అమిత్ షా రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అది నామమాత్రమేనని, అసలు పర్యటనకు వచ్చింది బీజీపీకి చీఫ్ ఎంపిక కోసమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2027 జమిలి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ ఎంపిక ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చంద్రబాబుకు దగ్గర కావడంతో...
ఎందుకంటే ప్రస్తుత చీఫ్ పురంద్రీశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కుటుంబ సభ్యురాలు కావడం కూడా పార్టీ ఎదుగుదల అంతగా జరగడం లేదన్న నివేదికలు కేంద్ర నాయకత్వానికి అందాయి. మొన్నటి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను పొందేందుకు కూడా వీలు లేకుండా పోయిందని బీజేపీలోని ఒక వర్గం ఒకింత ఆగ్రహంతో ఉంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. అందుకే ఎన్నికల తర్వాత పురంద్రీశ్వరికి కాకుండా కేంద్ర మంత్రి పదవి శ్రీనివాసవర్మకు ఇచ్చారని కూడా చెబుతున్నారు. అలాగే టీడీపీతో గతంలో సంబంధాలున్న సుజనా చౌదరి వంటి వారిని పక్కనపెట్టి తొలి నుంచి బీజేపీలో ఉన్న సత్యకుమార్ యాదవ్ వంటి వారిని రాష్ట్ర మంత్రి పదవికి ఎంపిక చేశారని అంటున్నారు.
పురంద్రీశ్వరిని తప్పిస్తే...
అయితే ఈసారి బీజేపీ చీఫ్ పదవి ఎవరికి అప్పగిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం కావడంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో పదవుల పంపకంలో కూడా కమలం పార్టీ నేతలకు పదవులు దక్కేలా చూడగలిగే నేతకు బాధ్యతలను అప్పగించే విషయమై అమిత్ షా సమాలోచనలు జరపుతున్నారని తెలిసింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు ప్రముఖంగా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తుంది. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అయితే పురంద్రీశ్వరిని అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశముందని కూడా ప్రచారం జరిగినా దానిని కొందరు నేతలు కొట్టి పారేస్తున్నారు. బీజేపీ చీఫ్ పదవి కోసం సీఎం రమేష్ తో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన సునీల్ కూడా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అమిత్ షా పర్యటన అందుకోసమేనని, బీజేపీ చీఫ్ ను ఎంపిక చేయడం కోసమే ఏపీకి వచ్చారన్నది అసలు విషయం.