Undavalli Arun Kumar : ఉండవల్లి జోస్యం నిజమవుతుందా?

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంచనాలు ఎప్పటికప్పుడు నిజమవుతాయని చెప్పలేం

Update: 2025-11-10 09:01 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంచనాలు ఎప్పటికప్పుడు నిజమవుతాయని చెప్పలేం. ఆయన మంచి అనువాదకుడు మాత్రమే కాని ఓటర్ల మనోభిప్రాయాలను ఒడిసిపట్టి తెలుసుకోలేరన్న అభిప్రాయం చాలా మంది నేతల్లో ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడూ జోస్యాలపైనే ఆధారపడుతుంటారు. ఆయన ప్రజల వద్దకు వెళ్లరు. తన వద్దకు వచ్చిన వారి నుంచి సమాచారాన్ని సేకరించి దానిని రాష్ట్ర వ్యాప్తంగా లెక్కేసి చెప్పడంలో దిట్ట కావడంతో ఆయన మాటలు కొందరి చెవులకు ఇంపుగా ఉంటాయి. మరికొందరికి కంటగింపుగా ఉంటాయి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన ప్రతిసారీ అదే లెక్క నిజమవుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి ఉంది.

ప్రతి మాటకు విలువ ఉండటంతో..
ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ సన్యాసం చేశారు. వైసీపీలో చేరతారన్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. కాకుంటే పదేళ్ల పాటు చట్టసభలో ఉండటంతో పాటు న్యాయవాది కూడా కావడంతో పాటు మాటకారి కూడా కావడం ఆయన చెప్పే ప్రతి మాటకు విలువ ఉంటుంది. అలాగని ఆయన లోతుగా అధ్యయనం చేసి చెప్పడానికి ప్రతిదీ పోలవరం ప్రాజెక్టు కాదు.. చిట్ ఫండ్ కంపెనీ కాదు. పాలిటిక్స్. ప్రజల మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. గత ప్రభుత్వం కూడా తాము కొన్ని దశాబ్దాలు పాలిస్తామని నమ్మింది. సంక్షేమ పథకాలు అండగా నిలుస్తాయని నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. కానీ ఆయన అంచనా తప్పింది. పదకొండు స్థానాలకే పరిమితమయింది. మూడు పార్టీలు కలిస్తే జగన్ కు కష్టమేనని చెప్పినా 11 సీట్లకు వైసీపీ పడిపోతుందన్న అంచనాలు మాత్రం ఉండవల్లి వేయలేకపోయారంటే అది ఖచ్చితంగా ఆయన కుర్చీ వద్దకు వచ్చిన సమాచారంతోనేనని ఖచ్చితంగా చెప్పాలి.
రాజకీయాల్లోకి రావాలన్నా...
ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలన్నా స్పేస్ లేదు. ఎందుకంటే రెండు, మూడు ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అనువైన వాతావరణం ఉంది. ప్రాంతీయ పార్టీల్లో ఉండవల్లి వంటి వారు చెల్లుబాటు కారు. అది ఆయనకు తెలుసు. అసలు ఉండవల్లి వంటి లిటిగెంట్ ను పార్టీల్లోకి తీసుకునే ప్రయత్నం కూడా ఏపీలోని ఏ ప్రాంతీయ పార్టీ చేయకపోవచ్చు. అది వైసీపీ కావచ్చు. టీడీపీ కావచ్చు. జనసేన అవ్వొచ్చు. ఎవరైనా ఆయనను గౌరవిస్తారు. అంతే తప్ప పిలిచి పదవి ఇచ్చే అవకాశం లేదు. సో.. ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలు ఉబుసుపోక చేసేవేనని పార్టీ నేతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పొంగిపోవడం లేదు. కుంగిపోవడం లేదు. ఇప్పటికైనా పెద్దాయన రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లుగానే కేవీపీ లాగా మౌనంగా ఉండటం మంచిదేమోనన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.










Tags:    

Similar News