Andhra Pradesh : డోలీలోనే డెడ్ బాడీ తరలింపు.. సోషల్ మీడియాలో వైరల్

విజయనగరం జిల్లా గిరి శిఖరం గ్రామంలో విషాదం జరిగింది. ఎస్ కోట నుంచి గ్రామానికి డెడ్ బాడీని డోలీలో తరలించారు

Update: 2024-01-17 06:43 GMT

ఎన్ని మార్పులు వచ్చినా గిరిజనుల జీవితాల్లో మార్పులు రావడం లేదు. గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు పదుల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాల్సి వస్తుంది. తాము పండించిన ఉత్పత్తులను కూడా బయటకు తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇక అనారోగ్యం బారిన పడితే అంతే. అనారోగ్యం బారిన పడిన వారిని మోసుకెళ్లేందుకు డోలీలను ఉపయోగించి తీరాల్సిందే.

మహిళ మృతి చెందడంతో...
తాజాగా విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు ప్రాంతంలోని గిరి శిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. చిట్టంపాడులో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను చికిత్స నిమిత్తం ఎలాగోలా విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆ మహిళ చికిత్స పొందుతూ మరణించింది. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎస్ కోట నుంచి ఆటోలు కూడా తాము రామని చెప్పడంతో విధిలేక ఆ మృతదేహాన్ని బొడ్డవర వరకూ ద్విచక్ర వాహనంపై తీసుకు వచ్చారు. వారం రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మరణించారు. మహిళ గంగమ్మ నిన్న మరణించగా, అంతకు ముందు అదే కుటుంబంలో పన్నెండేళ్ల బాలుడు మరణించాడు.
స్వగ్రామంలోనే ఉంటూ...
అక్కడి నుంచి డోలికట్టి మృతదేహాన్ని స్వగ్రామమైన చిట్టెంపాడుకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. గిరిశిఖర గ్రామానికి రోడ్డు వేస్తామని ప్రతి ఎన్నికల సమయంలో చెబుతూ దానిని మాత్రం విస్మరిస్తున్నారు. ఏడు దశాబ్దాల నుంచి వారి గతి ఇంతే. రహదారి సౌకర్యం లేకపోయినా పుట్టిన ఊరును వదలడానికి ఇష్టపడని గ్రామస్థులు అక్కడే నివాసం ఉంటున్నారు. చావో, రేవో ఇక్కడే అంటూ ఉన్నారు. చివరకు డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు కూడా వీలు లేని పరిస్థిితి. ఇప్పటికైనా గిరి శిఖర గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Tags:    

Similar News