Vijayawada : రేపంతా బెజవాడకు వెళ్లాలంటే.. ఇబ్బందే మరి.. రోజంతా ట్రాఫిక్ ఆంక్షలే

విజయవాడలో రేపంతా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు నగరపోలీసులు ప్రకటించారు

Update: 2024-01-18 12:16 GMT

విజయవాడలో రేపంతా ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు నగరపోలీసులు ప్రకటించారు. రేపు ఉదయం విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటంతో నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవడం మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి. అంబేద్కర్ విగ్రహావిష్కణకు రాష్ట్రం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు మంత్రులు కూడా ఈ కార్కక్రమానికి హాజరుకానుండటంతో ఈ ఆంక్షలను విధించారు.

ఆర్టీసీ బస్సులను...
ఆర్టీసీ బస్సులను కూడా విజయవాడ పట్టణంంలోకి రాకుండా వివిధ మార్గాలలో మళ్లింపు చేస్తున్నారు. ఏలూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగురోడ్డు మీదుగా మహానాడు జంక్షన్, నోవాటెల్ బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా వారధి జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ కు వెళతాయి.గుడివాడ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తాడిగడప నుంచి వంద అడుగుల రోడ్డు మీదుగా ఎనికెపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్ రోడ్డు, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ మీదుగా వారధి జంక్షన్ నుంచి బస్టాండ్ కు వెళతాయి. విజయవాడ నగరంలోకి విఐపీ వాహనాలను మినహాయించి మరే వాహనాన్ని అనుమతించరు.
ప్రయివేటు వాహనాలు....
భారీ వాహనాలను కూడా ఇతర మార్గాల నుంచి మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు లేదా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు నుంచి జి.కొండూరు మీదుగా మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ మీదుగా గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మీదుగా మళ్లిస్తారు. కార్లు వంటి వాహనాలను మాత్రం మేదరమెట్ల, అద్దంకి, నార్కేట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు పంపుతారు. వెళ్లే రూటు కూడా అలాగే ఉంటుంది. ప్రజలు దీనిని గమనించాలని విజయవాడ నగర పోలీసులు కోరుతున్నారు.
.


Tags:    

Similar News