Nara Lokesh : చిడతలు.. చిడతలు.. చిటికెలు.. చిటెకలోయ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కాకమునుపే టీడీపీ నేతల టోన్ మారింది
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కాకమునుపే టీడీపీ నేతల టోన్ మారింది. నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒకరకంగా భజన కార్యక్రమేనని పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. పదవుల కోసం నారా లోకేష్ ప్రాపకం కోసం ఈ రకమైన ప్రతిపాదనను తెస్తున్నారంటూ సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ నుంచే కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి కూటమి ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. అనేక సవాళ్లు ముందున్నాయి. ఈ సమయంలో ఇలాంటి చర్చకు తెరతీయడం అంటే కేవలం చిడతలు వేసే కార్యక్రమమేనంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ డిమాండ్ పై అప్పుడే జనసేన నేతలు స్పందిస్తున్నారు. తమ నేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేయాలని, కేంద్రమంత్రిగా చంద్రబాబు వెళ్లాలని వారు సూచిస్తున్నారు.
ఇదా సమయం?
నారా లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి అనర్హుడు కాదని కాదు. కానీ ఆయనకు చాలా వయసు ఉంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా జనసేన నేతలు నొచ్చుకుంటారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఆలోచనల్లో కూడా మార్పు వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడాలని చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు కూడా కూటమితోనే వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే దానికి గండికొట్టే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని క్యాడర్ భావిస్తుంది. సీనియర్ నేతలే ఇలా వ్యాఖ్యానిస్తుంటే ఇక కొత్తగా వచ్చే నేతల పరిస్థితి ఏంటన్న చర్చ పార్టీలో మొదలయింది. స్మూత్ గా వెళ్లే పాలిటిక్స్ ను సీనియర్ నేతలు చేజేతులా పక్కదారిపట్టించేలా ఉందంటున్నారు.
ఆ పదవి లేకపోయినా...?
నిజానికి నారా లోకేష్ కు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా లేకపోయినప్పటికీ ఆయన అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ఆయన మాట కాదని ఏ శాఖలో కూడా అధికారులు పనులు చేయని పరిస్థితి. అలాంటి సమయంలో మిత్రులతో వైరం పెంచుకునేలా ఇలాంటి వ్యాఖ్యానాలు పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తాయని అంటున్నారు. ఒకవేళ నిజంగా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తే పవన్ కల్యాణ్ నొచ్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పవన్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశముంది. 2029 ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు ఈ ప్రతిపాదన తెచ్చినా అర్థముందని, ఇప్పుడు ఈ డిమాండ్ తెచ్చి కొన్ని వర్గాలను కావాలని దూరం చేసుకునేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
మంత్రి పదవుల కోసమేగా?
తొలుత కడప జిల్లా నేత శ్రీనివాసరెడ్డి ఈ ప్రతిపాదనను బహిరంగ సభలోనే చేశారు. ఆయన కూడా తన భార్యకు మంత్రి పదవి కోసమే చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుసు. ఒకరు చెప్పినంత మాత్రాన, డిమాండ్ చేసినంత మాత్రాన తలొగ్గరు. ఇక తాజాగా డిప్యూటీ సీఎం పదవికి నారాలోకేష్ అర్హుడంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే రకమైన ప్రకటన చేశారు. ఆయన కూడా మంత్రి పదవి కోసమే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారంటున్నారు. డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను సమర్థిస్తున్నానని, యువగళం పాదయాత్రతో నాయకత్వాన్ని నిరూపించుకున్నారని, లోకేష్ నాయకత్వానికి ప్రజానీకం జైకొట్టిందని, లోకేష్ పేరును పరిశీలించాలని కోరుతున్నానని సోమిరెడ్డి భజన కార్యక్రమం బిగిన్ చేశారు. ఇది రాజకీయంగా తగదన్న సూచనలు వినిపిస్తున్నాయి.