ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని

Update: 2022-10-06 02:21 GMT

తిరుమ‌ల కొండ‌పై గ‌డ‌చిన 9 రోజులుగా సాగిన శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు బుధ‌వారం రాత్రి ముగిశాయి. బుధ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా సాగిన ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు ఏకాంతంగానే స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వహించగా ఈ ఏడాది భ‌క్తుల మ‌ధ్యే శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు వేడుక‌గా జ‌రిగాయి ఈ ఏడాది జ‌రిగిన బ్ర‌హ్మోత్స‌వాల‌కు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తార‌ని అంచ‌నా వేసిన టీటీడీ అందుక‌నుగుణంగానే ఏర్పాట్లు చేసింది. బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ ఎలాంటి విఘ్నాలు లేకుండానే పూర్తి అయ్యాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ‌వారి పుష్కరిణిలోని వరహా స్వామి మండపం వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగిశాయి.

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మా రెడ్డి తెలిపారు. 9 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో దాదాపు ఏడున్నర లక్షల మంది భక్తులు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీ‌వారి సేవ‌కుల‌ స‌మిష్టి కృషి, భక్తుల సహకారంతోనే శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు విజ‌య‌వంతం అయ్యాయ‌ని వైవి.సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ ఉత్సవాల్లో మొత్తం 24.89 లక్షల లడ్డూలు విక్రయించినట్టు చెప్పారు. అలాగే ఈ ఉత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం 20.43 కోట్ల రూపాయలు వచ్చినట్టు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. 2279 సిసిటివిలు, 4635 మంది టీటీడీ విజిలెన్స్‌, పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా 1.20 లక్షల జియోట్యాగ్‌లు అందించామని టీటీడీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News