Tirumala : తిరుమలలో మళ్లీ పెరిగిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈరోజు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అలిపిరి టోల్ గేట్ నుంచి ప్రారంభమయిన రద్దీ ఘాట్ రోడ్ లో వాహనాలతో కూడా కిక్కిరిసిపోయింది. నిదానంగా తిరుమల కొండకు చేరుకోవాలని, ఓవర్ టేక్ చేయవద్దంటూ ఎక్కడికక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది కోరుతున్నారు.
శ్రావణ శుక్రవారం కావడంతో...
శ్రావణ శుక్రవారం కూడా కావడంతో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన మాసంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వెల్లడించారు. తిరుమల వీధులు కూడా గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో కి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,800 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,212 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాాయం 4.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.