Metro Train : బెజవాడ, విశాఖ మెట్రోరైలు సక్సెస్ రేటు ఎంత?

విజయవాడలో మెట్రో రైలు ఏర్పాటు పై కొంత విమర్శలు వినిపిస్తున్నాయి.

Update: 2025-08-03 05:35 GMT

విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు పై కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. విజయవాడను అభివృద్ధి చేయాలంటే కేవలం మెట్రో రైలు వేసినంత మాత్రాన సరిపోదని అంటున్నారు. కోట్లాది మంది జనాభా ఉన్న హైదరాబాద్ లోనే మెట్రో రైలు నష్టాల్లో నడుస్తుందని, తాము నడపలేకపోతున్నామని ఎల్ అండ్ టి సంస్థ బహిరంగంగానే చెబుతుంది. టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి కోరినా రాజకీయాలు, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. హైదరాబాద్ మెట్రో రైళ్లకు ఆక్యుపెన్సీ బాగా ఉన్నప్పటికీ నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతుంది. హైదరాబాద్ జనాభా కోటికి పైగానే ఉంది. బెంగళూరు మెట్రో కూడా లాభాల బాటలో లేదు.

ఎక్కువ కిలోమీటర్లు...
పైగా హైదరాబాద్, బెంగళూరు మెట్రోలు ఎక్కువ కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి. అలాంటి చోట్లే మెట్రో రైళ్లు లాభాలతో నడవడం లేదు. పోనీ ప్రజా ప్రయోజనంతో నడపాలన్నా అంత పరిస్థితి నడిపే సంస్థలకు లేదు. అయితే విజయవాడ, విశాఖలో మెట్రో రైలు ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్న. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని అతి పెద్ద పల్లటూరు అని అంటారు. విజయవాడ నగరం ఎటు వెళ్లినా పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం ఉండదు. పైగా విజయవాడ జనాభా పది లక్షలకు మించలేదు. దీంతో మెట్రో రైళ్లలో ఎవరు ప్రయాణిస్తారన్న అనుమానం కలగుతుంది. కేవలం ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయన్న కారణంతో ప్రవేశపెడితే నష్టాలు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.
ఈ నగరాల్లో సక్సెస్ అయినా..
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్ లలో సక్సెస్ అయిన మెట్రో రైళ్లు ఆర్థికంగా చూస్తే ఇంకా లాభాల బాట పట్డడం లేదు. అక్కడ ప్రజల జీవనశైలిలో భాగమైన మెట్రో సేవలను బాగానే ప్రజలు వినియోగించుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ మూడు నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైళ్లు బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకే ఆక్యుపెన్సీ శాతం ఎక్కువగా ఉంది. అలాంటిది విజయవాడలో పది లక్షల జనాభా, విశాఖలో ఇరవై లక్షల జనాభా ఉన్న నగరాలకు మెట్రో రైళ్లు అవసరమా? అన్న సందేహాలు అయితే అందరిలోనూ కలుగుతున్నాయి. విజయవాడ మెట్రో రైలు తొలి దశ వ్యయం 10,118 కోట్లు కాగా, విశాఖ మెట్రో రైలు తొలి దశ వ్యయం 11,498 కోట్ల రూపాయలు అవుతుంది.
ఇంత డబ్బు పెట్టినా...
మొత్తం 21,616 కోట్ల రూపాయల అంచనాతో భారీ అంచనా వ్యయంతో వీఎంఆర్డీఏ, సీఆర్డీఏ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. విజయవాడ నగరంలో కేవలం ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో ఉన్న వారి కోసం వేల కోట్లతో మెట్రో నిర్మించడంలో హేతుబద్ధత ఆలోచించాలని కోరుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంతో మెట్రోకు కనెక్టివిటీ లేదు, అత్యధిక జనాభా నివసించే సింగ్ నగర్ ప్రాంతంతో సంబంధం లేదు. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎవరి కోసం నిర్మిస్తున్నారన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. విశాఖపట్నం ఒకరకంగా పరవాలేదు. ఎందుకంటే కొంత రద్దీ ఉన్న నగరం కావడంతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో ఇక్కడ మెట్రో కొంత వరకూ సక్సెస్ అవుతుందన్న ప్రభుత్వ అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News