Andhra Pradesh : వలసలు షురూ...ఖాళీ అవుతున్న పల్లెలు

పనులు లేవు. చేతిలో డబ్బులు లేవు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. దీంతో ప్రజలు వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది

Update: 2025-02-14 03:56 GMT

పనులు లేవు. చేతిలో డబ్బులు లేవు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. దీంతో ప్రజలు వలసలు పోయే పరిస్థితి ఏర్పడింది. లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు కర్నూలు జిల్లా నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళుతున్నారు. పట్టణాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని భావించి సొంతఊరును ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. దీంతో వృద్ధులు తప్ప గ్రామాల్లో ఎవరూ కనిపించడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లగా మరికొందరు ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీర ప్రాంతంలోని పట్టణాలకు వలస వెళుతున్నారు. గుంటూరు ప్రాంతంలో ఎక్కువగా పత్తి కోయడం, మిరప కోత పనుల కోసం వీరు తరలి వెళుతున్నట్లు చెబుతున్నారు.

కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లాలోని అనేక పల్లెల్లో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఖరీఫ్‌ సీజన్‌ ముగియడంతో పనులు వెతుక్కుంటూ రైతులు, వ్యవసాయ కూలీలు మూటముల్లె సర్దుకుని పిల్లపాపలతో వలస బాట పట్టారు. ఒకప్పుడు తనకున్న భూమిలో పండించి నలుగురికి అన్నం పెట్టే రైతన్న నేడు కూలీగా మారి వలస వెళ్లడం చూస్తుంటే కళ్లు చెమరుస్తున్నాయి. ఎంత కష్టం వచ్చిందని బంధువులు, సన్నిహితులు బాధపడుతున్నారు. ఒక్కప్పుడు వ్యవసాయ కూలీలు మాత్రమే వలస వెళ్లేవారు. ఇప్పుడు వ్యవసాయం కలసిరాక.. పెట్టుబడి అప్పులు తీర్చేదారి లేక రైతులే కూలీలుగా మారి పనుల కోసం పట్టణాల బాట పట్టారు. సొంత ఊరిలో కూలీలుగా కన్పించడం ఇష్టం లేక పట్టణాల్లో పనిచేయడానికి వెళ్లిపోతున్నారు.
ఉపాధి హామీ పథక అందుబాటులో...
కర్నూలు జిల్లాల్లో అనేక గ్రామాలకు ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. చేతులో డబ్బులు లేకపోవడం, సంక్షేమ పథకాలు తమకు అందకపోవడంతో వారు తప్పని సరి పరిస్థితుల్లో గ్రామాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. . కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల్లో ఏ ఊరికి వెళ్లినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తలుపులకు తాళం వేసిన ఇళ్లు, ఆ ఇళ్లకు కాపలాగా ఉన్న వృద్ధులే కనిపిస్తారు. పంట కోతకు వెళితే రోజుకు పురుషులకు ఏడు వందలు, మహిళలకు ఆరు వందల రూపాయల వరకూ ఇస్తుండటంతో అందుకోసం పరుగులు పెడుతున్నారు.ఉపాధి హామీ పథకంలో నిబంధనలు వీరి బతుకుకు అవరోధంగా మారాయి. ఇరవై ఐదు రోజుల్లోనే వంద పనిదినాలు మాత్రమే చేయాలన్న నిబంధన వీరిని వలస బాట పట్టిస్తుంది.





Tags:    

Similar News