Andhra Pradesh : పింఛను ఈ నెల అయినా ఇంటివద్దకు అందుతుందా? టీడీపీలో టెన్షన్

ఈ నెల కూడా పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ ఆందోళన చెందుతుంది

Update: 2024-04-25 04:43 GMT

ఒకటో తేదీ వస్తుందంటే విపక్ష పార్టీలకు టెన్షన్ పట్టుకుంటుంది. ఈ నెల కూడా పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన చెందుతున్నారు. గత పింఛను పంపిణీ ఆలస్యం కావడంతో గ్రామ సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో చాలా మంది వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతోనే పింఛను ను వాలంటీర్లు ఇంటికి చేర్చడం లేదన్న ప్రచారం బాగా వెళ్లింది. దానికి తగ్గట్లుగానే గత నెలలో పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోవడంతో వృద్ధులు ఎండకు ఇబ్బంది పడిపోయారు. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఒకటో తేదీ వస్తుంది.

Full Viewగతంలో ప్రతి నెలా...
వైసీపీ ప్రభుత్వం ఉండగా ప్రతి నెల ఒకటో తేదీ ఠంచనుగా ఇంటివద్దకు వెళ్లి వాలంటీర్లు పింఛను అందించేవారు. కానీ ఎన్నికల కోడ్ అమలులో రావడంతో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేసిందని, టీడీపీ నిమ్మగడ్డ చేత ఫిర్యాదు చేయించిందని టీడీపీపై వైసీపీ నేతలు చేసిన ప్రచారం బాగా వెళ్లింది. తమకు యాభై ఎనిమిది నెలల పాటు ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే పింఛను మళ్లీ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలంటే అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇది టీడీపీకి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ అధికారులు కావాలనే ఆలస్యం చేశారంటూ ఆరోపించింది.
ఇంటివద్దకే పింఛను..
గ్రామ సచివాలయం సిబ్బంది చేత ఇంటింటికీ పింఛనును పంపిణీ చేయించాలని చంద్రబాబు సయితం చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అయినా మార్చి ఆఖరు కావడంతో బ్యాంకులకు సెలవులు ఉండటంతో నగదును తీసుకోవడం ఆలస్యమయిందని అధికారులు వివరణ ఇచ్చారు ఇప్పుడు మరోసారి మే 1వ తేదీ వస్తుంది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నెల పింఛను పంపిణీ ఆలస్యమయితే తమకు మరింత డ్యామేజీ అవుతుందని భావించి చంద్రబాబు ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇంటివద్దకే పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికార పార్టీతో కుమ్మక్కయిన కొందరు అధికారులు గత నెల పింఛను పంపిణీలో ఆలస్యం చేశారని, ఈ నెల కూడా అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరి ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News